డీప్‌ఫేక్ వీడియోలు (Deep Fake Videos), ఫొటోలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. తాజాగా సోషల్ మీడియా (Social Media) సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) కీలక సమావేశం నిర్వహించారు. డీప్ ఫేక్ వీడియో, ఫోటోలను నియంత్రించేందుకు త్వరలోనే నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.
డీప్‌ఫేక్ పెద్ద సామాజిక ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ చర్య అవసరమని పేర్కొన్నారు. డీప్‌ఫేక్ కంటెంట్ వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఆ వీడియోలను అరికట్టేందుకు మీడియా డిటెక్షన్, ప్రివెన్షన్, రిపోర్టింగ్ మెకానిజం సహా ఇతర అంశాలతో కూడిన ఓ బలోపేతమైన వ్యవస్థ అవసరమని కేంద్రం గుర్తించిందని వివరించారు.
ఈ వ్యవహారంలో సామాజిక మాధ్యమాలతో కలిసి ముందుకు వెళ్తామని అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త నిబంధనలు తీసుకు వస్తామని చెప్పారు. వచ్చే నెలలో ముసాయిదాను పూర్తి చేస్తామన్నారు. ముప్పు తీవ్రత, డీప్ ఫేక్ వీడియోలపై నియంత్రణ ఆవశ్యకతపై సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు అంగీకరించాని వెల్లడించారు.
డీప్‌ఫేక్ అనేది వాక్ స్వాతంత్ర్యం కాదన్నారు. ఇది నిజంగా సమాజానికి హానికరమని పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో డీప్‌ఫేక్ సృష్టిస్తున్న ఈ నష్టం అనేది మన ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పును తీసుకు వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత దుర్వినియోగం విషయంలో ఇప్పటికే ఉన్న ఫ్రేమ్‌వర్క్‌ను సవరించాలా లేదా నూతన నిబంధనలు తీసుకు రావాలా, అవసరమైతే కొత్త చట్టాన్నే తీసుకు రావాలా అనే అంశంపై నిశితంగా పరిశీలనలు చేస్తున్నామన్నారు.