ఈ పదేండ్ల నుంచి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ (KCR) ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. తెలంగాణ, కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని తెలిపారు. ఈ సారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభను నిర్వహించింది. ఈ సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ….. గత 27 ఏండ్లుగా గుజరాత్‌ను దేశంలోనే ఒక గొప్ప మాడల్‌గా అభివృద్ధి చేశామన్నారు. ఇక్కడ తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్‌ను రాజ్ నాథ్ సంగ్ ప్రశ్నించారు.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయ్ మొదలు నేటి ప్రధాని మోడీ వరకు బీజేపీ ప్రభుత్వాల్లో పని చేసిన నాయకులపై కనీసం ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగం ఇస్తామని బీఆర్ఎస్ చెప్పిందన్నారు. కానీ ఆ తర్వాత మోసం చేసి పేపర్ లీకేజీలకు పాల్పడిందన్నారు.
దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి ఆ తర్వాత కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతిపరులను జైలుకు పంపిస్తామన్నారు. మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఇది ఇలా వుంటే మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తనను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.