దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు నాణ్యత (AQI) మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB)ప్రకారం మధ్యాహ్నం గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత 400 గా నమోదైంది. ఢిల్లీ, దాని శివారు ప్రాంతాలను పొగ మంచు కమ్మేసింది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ వద్ద ఉదయం 8 గంటలకు దృగ్గోచరత 600 మీటర్లకు తగ్గిపోయింది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ 800 మీటర్లుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. గాలి వేగంలో స్వల్ప పెరుగుదల, తేలికపాటి వర్షపాతం వల్ల పగటిపూట స్వల్ప ఉపశమనం కలిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రెండు మూడు రోజుల పాటు వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందన్నారు.
ఆదివారం సరాసరి వాయు నాణ్యత 395గా ఉన్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందు శనివారం ఇది 389, శుక్రవారం 415, గురువారం 390, బుధవారం 394, మంగళవారం 365, సోమవారం 348గా నమోదైనట్టు తెలిపారు. ఇది ఇలా వుంటే ఈ రోజు ఆర్కేపురంలో వాయు నాణ్యత 419గా నమోదైనట్టు సీపీసీబీ చెప్పింది.
సీపీసీబీ డేటా ప్రకారం…. ఐటీవో సెక్టార్‌లో 435, ద్వారకా సెక్టార్‌లో 402, జహంగీర్ పురి 437, అశోక్ విహార్ 455 వాయునాణ్యత తీవ్రస్థాయిలో ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు వాయు నాణ్యత సూచీ 10 సార్లు తీవ్ర స్థాయికి పడిపోయింది. గతేడాది నవంబర్‌లో ఏక్యూఐ కేవలం మూడు సార్లు మాత్రమే తీవ్ర స్థాయికి పడిపోయినట్టు అధికారులు వివరించారు.