మానవ తప్పిదాల వల్ల ప్రకృతి ఇప్పటికే నాశనం అయ్యిందని పర్యావరణ వేత్తలు.. ప్రకృతి ప్రేమికులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య ఇలాగే కొనసాగితే భావితారాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. అయినా స్వలాభం, స్వార్థం కోసం ప్రకృతి గురించి ఆలోచించడం మానేశాడు మనిషి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగడం ఆందోళన కలిగిస్తుంది.
దీపావళి తర్వాత ఇక్కడ కాలుష్యం తారాస్థాయికి చేరింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగమంచు పేరుకుపోయి ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకొనేందుకు ఇబ్బందులుపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వంతో పాటు వివిధ ఏజెన్సీలు చలికాలంలో వాయు కాలుష్యాన్ని (Air Pollution) నియంత్రించడంలో విఫలమవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ (Air quality) చాలా పూర్ గా నమోదవుతుంది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు గాలి నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అయితే, శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ప్రకారం..
బుధవారం ఉత్తర దిశ నుంచి గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి వేగం తగ్గడంతో కాలుష్యం పెరిగింది. గురువారం తూర్పు దిశ నుంచి గాలులు వచే అవకాశాలున్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ పేర్కొంది. ఉదయం సమయంలో భారీగా పొగమంచు పేరుకుపోతుందని అంచనా వేసింది. శుక్రవారం ఉత్తర, వాయువ్య దిశల నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని ఐఐటీఎం పేర్కొంది.