Delhi : జీ 20 సమ్మిట్ త్వరలో జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ లోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’ అనే రాతలు కనిపించడంతో పోలీసులు ఖంగు తిన్నారు. దీనితో బాటు ‘ఖలిస్తాన్ రెఫరెండం జిందాబాద్’ అనే నినాదాలను కూడా ఖలిస్తాన్ అనుకూల వర్గాలు స్పష్టంగా రాశాయి. పంజాబీ బాగ్, శివాజీ పార్క్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, వంటి అనేక చోట్ల గోడలపై నల్లని రంగుతో అక్షరాలను స్ప్రే చేశారు.
చివరకు ఓ ప్రభుత్వ పాఠశాల గోడలపై కూడా ఈ నినాదాలు కనిపించాయి. ఖలిస్థాన్ అనుకూల నిషిద్ధ సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన సభ్యులు ఈ పనికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. తాము చేసిన ఈ ‘ఘన కార్యానికి’ సంబంధించిన ఫుటేజీని ఈ సంస్థ రిలీజ్ చేసిందని వారు తెలిపారు.
సెప్టెంబరు 10 న కెనడా లోని సర్రేలో ఖలిస్థాన్ రెఫరెండం నిర్వహిస్తామని ఈ సంస్థ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను ఈ వీడియోలో ప్రకటించాడన్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ 20 సదస్సు జరగనుంది. కాగా ఈ రాతలను చెరిపేసిన పోలీసులు వీటిని స్కాన్ చేసి.. ఎవరు రాశారో దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఈ రాతల వ్యవహారం వారికి ఓ సవాలుగా మారింది. రాత్రికి రాత్రే ఇవి పబ్లిగ్గా గోడలపై కనబడడం సంచలనం కలిగించింది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఖలిస్థాన్ అనుకూల శక్తులు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నాయి.