న్యూ ఇయర్(New Year) వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు(Delhi Police) అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 10వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో దీన్ని అమలు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఢిల్లీకి ఆనుకుని ఉండడంతో ఆయా రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బార్లు, క్లబ్‌లు, మాల్స్, రెస్టారెంట్లకు సంబంధించి పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు డిప్యూటి కమిషనర్ (నార్త్-ఈస్ట్) జాయ్ టిర్కీ మీడియాతో మాట్లాడుతూ.. రెండు షిఫ్టుల్లో పోలీసు మోహరింపు ఉంటుందని చెప్పారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేల జరిమానాతో పాటు పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేస్తామన్నారు. అధిక రద్దీని నివారించడానికి, మెట్రో ప్రయాణికులను రాత్రి 9 గంటల తర్వాత రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ నుంచి బయటకు అనుమతించరని అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు వీధుల్లోనే ఉండాలని ఆదేశించారు. మోటార్ సైకిల్ స్టంట్ లేదా ట్రిపుల్ క్యారీకి అనుమతి లేదని టిర్కీ చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే.. పోలీసు బృందాలు వెంటనే మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. సుమారు ఢిల్లీ ట్రాఫిక్ ద్వారా దాదాపు 2,500 మంది సిబ్బందిని రోడ్లపై మోహరించనున్నట్లు తెలిపారు.