లిక్కర్ స్కామ్ కేసు(Liquor scam case)లో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్(Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. అయితే, ఢిల్లీ ఎక్సెజ్ పాలసీ కేసులో కేజీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేశారు.
అయితే, ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈడీ ఏడోసారి నోటీసులు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈడీ ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసుల్లో వెల్లడించింది. తాజా నోటీసులపై కేజ్రివాల్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.
ఇక, గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న, మరోసారి జనవరి 13న, జనవరి 31, ఫిబ్రవరి 14న నోటీసులు జారీచేసింది ఈడీ. కానీ, ఈడీ నోటీసులను సీఎం అరవింద్ కేజ్రివాల్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు.
ఈ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా తదితరులు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేస్తున్నా కేజ్రీవాల్ మాత్రం ప్రతీసారి దాటవేస్తూ వస్తున్నారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈసారైనా ఆయన విచారణకు వెళ్తారో లేదో చూడాలి.