లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election)కు ముందు ఢిల్లీ (Delhi)లో రైతుల నిరసనలు మొదలవడం దేశ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే రైతులు చేస్తున్న నిరసనల్లో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కనిపిస్తోంది. ఈ క్రమంలో రైతులు కీలక నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హమీ, రుణమాఫీ, కేసుల ఎత్తివేతతో పాటు పలు డిమాండ్లకు పరిష్కారం కోరుతూ తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు వేలాదిగా రైతులు ఢిల్లీకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మలు, టియర్ గ్యాస్ లతో ఎక్కడిక్కడ రైతులను కట్టడిచేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) సరిహద్దులో శంభు వద్ద తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.
ఈ క్రమంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఒక రైతు మరణించారు. దీంతో వాతావరణం మరింత హీట్ గా మారింది. ఇదిలా ఉండగా ఘర్షణలో చనిపోయిన రైతు కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇక బుధవారం జరిగిన ఘర్షణలో పలువురు రైతులతో పాటు 12 మంది పోలీసులు సైతం గాయపడ్డారు. దీంతో ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను రైతులు రెండు రోజులపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
మరోవైపు కేంద్ర మంత్రులు, రైతులతో చేసిన నాలుగో విడత చర్చలు విఫలమవ్వడంతో, నిరసనలను మరింత తీవ్ర తరం చేశారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 26న ట్రాక్టర్ మార్చ్.. రాంలీలా మైదానంలో మార్చి 14న కిసాన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ప్రకటించింది. ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నామని వెల్లడించింది. కాగా రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.