ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా ఈడీ (ED) కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కావాలంటే మరో 10 రోజులు సమయం ఇస్తామని తెలిపింది. అంతేగానీ, విచారణకు రాకుండా ఉండడం కుదరని.. తప్పకుండా రావాల్సిందేనని చెప్పింది.
ఈడీ విచారణను తప్పుబడుతూ ఎమ్మెల్సీ కవిత తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఆమెకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించొద్దని సూచించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. వాదనల అనంతరం సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. నళినీ చిదంబరం తరహాలోనే తనకూ ఊరట కావాలని కవిత కోరగా.. ఈడీ న్యాయవాది స్పందన కోరింది సుప్రీం. తమకు అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలుపగా.. ఈనెల 26 వరకు సమన్లు జారీ వద్దని జస్టిస్ కౌల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనల తర్వాత.. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
నేను అప్రూవర్ కాదు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై (Ramachandra pillai) అప్రూవర్ అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను అప్రూవర్ గా మారలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో తాను అప్రూవర్ గా మారారని వస్తున్న వార్తలను ఖండించారు పిళ్లై తరఫు న్యాయవాదులు. తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్ పిళ్లై ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు న్యాయవాదులు.