– ఎన్నికల వేళ హస్తానికి అస్త్రంగా ఢిల్లీ లిక్కర్ కేసు
– బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని విమర్శల దాడి
– ఎవరు తప్పు చేసినా జైలుకేనంటున్న కమలనాథులు
– అభిషేక్ బోయినపల్లి పిటిషన్ పై విచారణ
– కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
– కౌంటర్ దాఖలు కోసం ఈడీకి ఆదేశాలు
తెలంగాణ (Telangana) ఎన్నికల వేళ కాళేశ్వరం(Kaleswaram) లోపాలతోపాటు ప్రధానంగా వినిపిస్తున్నది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case). ఈ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha) పాత్ర ఉందని.. దర్యాప్తు సంస్థలు అంటుంటగా.. అంతా డ్రామా అని ఆమె కొట్టిపారేస్తున్నారు. అయితే.. ఈ కేసులో కవితను బీజేపీ (BJP) కాపాడుతోందనే విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ (Congress). ఈ రెండు పార్టీలు ఒక్కటేనని గట్టిగా వాదిస్తోంది. కానీ, కమలనాథులు మాత్రం ఎవరు అవినీతి చేసినా కటకటాల్లోకి నెడతామని చెబుతున్నారు. ఈమధ్య రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ (PM Modi) కూడా దీన్ని స్పష్టం చేశారు.
ఓవైపు ఎన్నికల ప్రచారంలో ఈ కేసుపై మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఇంకోవైపు కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితకు దగ్గరి మనిషిగా చెబుతున్న అభిషేక్ బోయినపల్లి (Abhishek Boyinapalli) బెయిల్, అరెస్ట్ పిటిషన్లపై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. తన అరెస్టు చట్టబద్ధతను సవాల్ చేస్తూ అభిషేక్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్ కన్నా, జస్టిస్ ఎస్ఎన్‌వీ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పీఎంఎల్ఏ సెక్షన్ 19 పరిగణనలోకి తీసుకోకుండా అరెస్ట్ చేశారని అభిషేక్ తరఫు లాయర్లు వాదించారు. సీబీఐ కేసులో బెయిల్ వచ్చాక ఈడీ కేసులో అరెస్ట్ చేశారని, సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.
ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అభిషేక్ బోయినపల్లికి లిక్కర్ కుంభకోణంలో ఇండో స్పిరిట్ నుంచి 3.85 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సాక్షాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం అభిషేక్ లేవనెత్తిన అంశాలపై 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది.
రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సాగుతోంది. ఊహించని పరిణామాలు, కీలక మలుపులతో అనేక ప్రకంపనలు సృష్టించింది. ఓ చిన్న ఆరోపణతో మొదలైన ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. వరుస సోదాలు, రోజుల తరబడి విచారణలతో ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. రాజకీయ యుద్ధానికి దారి తీసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేశారు అధికారులు. తన అరెస్ట్ చట్టబద్ధతపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అభిషేక్ తొమ్మిది కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. రియల్ ఎస్టేట్, మైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్, కంప్యూటర్ సర్వీసులతో పాటు మరికొన్ని సంస్థల్లో కీలక వ్యక్తిగా వ్యవహరించినట్టు గుర్తించారు అధికారులు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్టు తేల్చారు. రామచంద్ర పిళ్లైతో కలిసి వ్యాపారాలు చేసినట్టు గుర్తించారు. పలువురు రాజకీయ నేతలతో కూడా పరిచయాలు ఉన్నట్టు విచారణలో తేల్చారు. ఈ క్రమంలోనే కవితను విచారించాయి దర్యాప్తు సంస్థలు.