Telugu News » MLC Kavitha : ఈడీ కస్టడీ.. కవితకు బిగ్ షాక్

MLC Kavitha : ఈడీ కస్టడీ.. కవితకు బిగ్ షాక్

లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు.

by Venu

– కవితను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ
– 10 రోజుల కస్టడీ కోసం పిటిషన్
– వాడీవేడిగా కొనసాగిన వాదనలు
– 7 రోజుల కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు
– 23న హాజరుపర్చాలని ఆదేశం
– ఫ్యామిలీ, లాయర్లను కలిసేందుకు పర్మిషన్
– ఇంటి నుంచే భోజనం
– కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు
– లిక్కర్ స్కాం కింగ్ పిన్ కవితేనన్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. పది రోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. విచారణ సందర్భంగా కోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగాయి. కవిత రిమాండ్ అప్లికేషన్‌ ను ఈడీ తరఫు న్యాయవాది జోసెబ్ హుస్సేన్ కోర్టుకు అందించారు. అరెస్ట్ చేయడానికి గల కారణాలు అందులో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 5:43 అరెస్టు చేసినట్లు లిఖితపూర్వకంగా తెలిపారని వివరించారు. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ జరిగిందనేది అవాస్తవమని ఆయన అన్నారు. సోదాల్లో మొత్తం 5 ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారని, మొత్తం వీడియో రికార్డు చేసి పబ్లిక్ డొమైన్‌లో ఈడీ పెట్టిందని జోసెబ్ హుస్సేన్ వెల్లడించారు.

కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు లేవని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన విషయాలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 15న వచ్చే 10 రోజుల్లో సమన్లు ఇవ్వమని మాత్రమే చెప్పామని అన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పినట్లు తెలిపారు. వేరే వారికి ఇచ్చిన ఉత్తర్వులను అన్వయించుకోవద్దన్నారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకి రాదని తెలిపారు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు లేవని జోసెబ్ హుస్సేన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని, సుప్రీంకోర్టులో ఏఎస్జీ చెప్పిన 10 రోజుల గడువు ఎప్పుడో తీరిందని తెలిపారు. గడువు తీరాక ఎన్నోసార్లు కోర్టులో విచారణ జరిగిందని వివరించారు. సెప్టెంబర్ 15న ఇచ్చిన అండర్ టేకింగ్‌నే ప్రస్తావిస్తున్నారని అన్నారు. నళినీ చిదంబరం పిటిషన్‌లో ఇచ్చిన ఉత్తర్వులనే వీళ్లు అన్వయించుకుంటున్నారని జోసెబ్ హుస్సేన్ వివరించారు.

అంతకుముందు సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించిందని కవిత లాయర్‌ విక్రమ్‌ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హామీని ఉల్లంఘించి అరెస్టు చేశారని తెలిపారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని విక్రమ్‌ చౌదరి న్యాయమూర్తికి తెలిపారు. 2023, సెప్టెంబర్‌ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని, కవితను అరెస్టు చేయబోమని చెప్పారని వెల్లడించారు. అదే నెల 26న మరోసారి వాదనలు జరిగాయని, ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని తెలిపారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని చెప్పారు. అయినా కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇరువురి తరఫు వాదనలు విన్న సీబీఐ స్పెషల్‌ జడ్జి ఎంకే నాగ్‌ పాల్‌.. కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. 23న హాజరుపర్చాలని ఆదేశించారు. ఫ్యామిలీ, లాయర్లను కలిసేందుకు కవితకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే, ఇంటి నుంచే భోజనం తెప్పించుకునేందుకు అనుమతించారు.

మరోవైపు, కస్టడీ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు అని తెలిపారు.

You may also like

Leave a Comment