విభజన హామీల అమలుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఏపీ కాంగ్రెస్.. ఢిల్లీ (Delhi)లోని ఏపీ భవన్, అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగింది. ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) నేతృత్వంలో ధర్నా చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. కేంద్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ (Manikyam Tagore) ఈ ధర్నాకు మద్దుతు తెలిపారు.
మరోవైపు ధర్నాకు ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని ఏపీ కాంగ్రెస్ నేతలు (AP Congress Leaders) కలిశారు. తమకు మద్దతు ఇవ్వాలని, పార్లమెంట్లో ఏపీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. షర్మిలతో పాటు ధర్నాలో కేవీపీ, జేడీ శీలం, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, తదితరులు కూర్చున్నారు.
ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పరిశ్రమలు వచ్చేవని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీలు ఏమయ్యాయని నిలదీశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ రైల్వే జోన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ-వైఎస్సార్సీపీ కాలరాశాయని విమర్శించారు. గతంలో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. బీజేపీకి గులాం గిరి చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. సాధిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ముందు ధర్నా కోసం ఏపీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా, ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.