కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ(Delhi) ఊపిరిపీల్చుకుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయి 400 నుంచి 100కి పడిపోయింది. ఢిల్లీ-నోయిడాలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షం కురవడమే ఇందుకు కారణం. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదైంది. అంతేకాకుండా, కాలుష్యం(Pollution) నుంచి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభించింది. దీంతో పండుగ పూట పెద్ద ఊరట లభించినట్లయింది.
శుక్రవారం ఢిల్లీలో సాధారణంగా మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి నైరుతి ఢిల్లీ, ఎన్సీఆర్ (గురుగ్రామ్)తో పాటు హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. గోహనా, గన్నౌర్, మెహమ్, సోనిపట్, ఖరోడా, చర్కి దాద్రీ, మట్టన్హెల్, ఝజ్జర్, ఫరూఖ్నగర్, కోస్గి, సోహ్నా, రేవారి, బవాల్లో చినుకులు పడుతున్నాయి. రాజస్థాన్‌లోని భివాడిలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది.
కాగా, ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయని, అది కృత్రిమ వర్షం కాదని.. దేవుడే వర్షం కురిపించాడని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి అన్నారు. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం కూడా కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేసింది. నవంబర్ 20, 21 తేదీల్లో ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీని కంటే ముందే ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కోట్లాది రూపాయలు వెచ్చించనున్నారు.
పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. ఐఐటీ-కాన్పూర్ బృందాన్ని కలిసిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ద్వారా కృత్రిమ వర్షం సృష్టించాలని యోచిస్తోందని తెలిపారు. కృత్రిమ వర్షాలకు అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ అభిప్రాయాలను శుక్రవారం తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది.