దట్టమైన పొగమంచు(Dense Fog) ఉత్తర భారతాన్ని కమ్మేసింది. దీంతో ఉత్తర భారతదేశంలోని (North India) చాలా రాష్ట్రాల్లో చలి వాతావరణం కొనసాగుతున్నది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌ను మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
తీవ్ర మైన చలి ప్రభావం వల్ల నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పాఠశాలలకు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పొగమంచుతో ముఖ్యంగా రవాణా రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రోడ్డుపై వెళ్లాలంటే పట్టపగలు లైట్లు వేసుకుని వెళ్లాల్సివస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లను అధికారులు పెద్ద సంఖ్యలో రద్దుచేస్తున్నారు. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలిగాలుల ప్రభావం వల్ల వచ్చే జనవరి 4వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
రానున్న ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 31 తర్వాత పొగ మంచు క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది.