Telugu News » TS Assembly : అసెంబ్లీలో విద్యుత్ మంటలు..!

TS Assembly : అసెంబ్లీలో విద్యుత్ మంటలు..!

సభను బీఆర్ఎస్ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు కేకలు వేశారు. దీనిపై భట్టి మండిపడ్డారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. దీనిపై జగదీష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మంత్రుల తీరు సరిగ్గా లేదన్నారు. సంబంధం లేని శాఖలపై వేరే మంత్రులు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. శ్వేతపత్రం తప్పని ఒప్పుకుంటారా? అని అడిగారు. దీనిపై భట్టి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

by admin
deputy-cm-bhatti-vikramarka-counter-to-jagadish-reddy

– విద్యుత్ రంగ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ
– 2014కు ముందు పరిస్థితుల్ని వివరించిన జగదీష్ రెడ్డి
– మీరేం చేశారో చెప్పుకోవాలని శ్రీధర్ బాబు సెటైర్లు
– గత విషయాలు తెలిస్తే ఏం చేశామో తెలుస్తుందని మాజీ మంత్రి కౌంటర్లు
– యాదాద్రి ప్లాంట్ పెద్ద కుంభకోణమన్న కోమటిరెడ్డి
– ఏ విచారణకైనా సిద్ధమని జగదీష్ సవాల్
– మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం
– జగదీష్ రెడ్డి తీరుపై భట్టి విక్రమార్క సీరియస్
– నోరేసుకుని పడిపోవద్దని విమర్శలు

విద్యుత్ రంగంపై మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శ్వేతపత్రం విడుదల చేశాక అసెంబ్లీ దీనిపై చర్చ మొదలైంది. ముందుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వచ్చే నాటికి విద్యుత్ రంగ పరిస్థితిని వివరించారు. 2014 జూన్‌ 2 నాటికి నాలుగు విద్యుత్‌ సంస్థల ఆస్తులు రూ.44,434 కోట్లు అని పేర్కొన్నారు. 2014 జూన్‌ 2 నాటికి రూ.22,423 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తుల రూ.1,37,570 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందించామని తెలిపారు. అంతేకాకుండా, విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని వివరించారు.

deputy-cm-bhatti-vikramarka-counter-to-jagadish-reddy

కాంగ్రెస్ పాలనలో సరిగ్గా విద్యుత్ ఉండేది కాదన్నారు జగదీష్ రెడ్డి. పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే.. తల్లిదండ్రులు కిరోసిన్, కొవ్వొత్తులు కొనుగోలు చేసేవారని ఎద్దేవ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మండిపడ్డారు. 2014 నుంచే రాష్ట్ర ప్రజలు మంచినీరు తాగుతున్నట్టు, విద్యుత్ సరఫరా వాళ్లే మొదలుపెట్టినట్టు.. మొత్తం అంధకారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. మీరు చేసిన ప్రగతి చెప్పుకోవాలని.. 2014 ముందు సంగతులు ఎందుకని ప్రశ్నించారు. అప్పటి పరిస్థితులను తాము కూడా వివరిస్తామని స్పష్టం చేశారు.

శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు. తాను ఎక్కడా చిన్న విమర్శ కూడా చేయలేదన్నారు. ఎందుకంత తొందరపడుతున్నారని సెటైర్లు వేశారు. ఇప్పుడు ఎలా ఉన్నామో తెలుసుకోవాలంటే ఆనాటి పరిస్థితులను గుర్తు చేశానని తెలిపారు. తాను పదో తరగతి చదివినప్పటి నుంచి తన పిల్లలు పదో తరగతి చదివే వరకు కిరోసిన దీపాల కిందే చదివామని అన్నారు జగదీష్ రెడ్డి. తమ హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని.. విద్యుత్‌ పై ధర్నాలు చేసే అవకాశం ఇవ్వలేదన్నారు. ఒక్క రోజు కూడా పవర్‌ హాలిడే ఇవ్వలేదని వివరించారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయని.. అంత మాత్రాన అందరం చెడ్డవాళ్లమా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు జగదీశ్ రెడ్డి.

మాజీ మంత్రి వ్యాఖ్యల తర్వాత ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైక్ అందుకున్నారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధమని అన్నారు. ఏ గ్రామానికైనా వెళ్దామని ఛాలెంజ్ చేశారు. వాళ్ల హయాంలో తాను ఓ సబ్ స్టేషన్ కు వెళ్లి లాగ్ బుక్ చెక్ చేస్తే.. 8 గంటలకు మించి ఇవ్వడం లేదని అక్కడి అధికారే చెప్పాడన్నారు. ఆ తర్వాత అన్ని సబ్ స్టేషన్ల బుక్స్ హైదరాబాద్ తరలించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చరిత్రలో 16 గంటల కరెంట్ సరఫరానే అత్యధికమని.. అది కూడా పది, పన్నెండు రోజులు ఇచ్చారని వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 10 వేల కోట్లు జగదీశ్‌ రెడ్డి తిన్నారని, టెండర్‌ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి ఆరోపణలపై స్పందించిన జగదీష్ రెడ్డి.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తారా? కమిషన్ వేసి చేయిస్తారా? వెంటనే ఆదేశించుకోవచ్చని ఛాలెంజ్ చేశారు. దోషులు ఎవరో తేలితే శిక్ష వేయాలని.. లేదంటే, ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినందుకు కోమటిరెడ్డి శిక్ష అనుభవిస్తారా? అని అడిగారు. ఇవన్నీ పనికిరాని మాటలు కాబట్టే ఇన్నాళ్లూ పట్టించుకోలేదని.. ఇప్పుడు సభలో ప్రస్తావించినందుకు ప్రజలకు తెలియాలని స్పందిస్తున్నానని అన్నారు. తర్వాత మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని పేర్కొన్నారు. సభను బీఆర్ఎస్ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు కేకలు వేశారు. దీనిపై భట్టి మండిపడ్డారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. దీనిపై జగదీష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మంత్రుల తీరు సరిగ్గా లేదన్నారు. సంబంధం లేని శాఖలపై వేరే మంత్రులు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. శ్వేతపత్రం తప్పని ఒప్పుకుంటారా? అని అడిగారు. దీనిపై భట్టి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 24 గంటల కరెంట్ అని శ్వేతపత్రంలో తాము ఎక్కడా మెన్షన్ చేయలేదన్నారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులందరూ ఓసారి కూర్చొని మాట్లాడుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు ప్రకటించిన శ్వేతపత్రం తప్పని ఒప్పుకుని కొత్తది విడుదల చేయమన్నారు.

You may also like

Leave a Comment