రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ (Telangana) ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం. ఇప్పటికే ఆ దిశగా శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రం మొత్తం అప్పులపై డీటెయిల్డ్ గా వివరించింది. ఇదే క్రమంలో విద్యుత్ రంగానికి సంబంధించిన శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 30 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు.
విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని వెల్లడించారు. 2023 అక్టోబర్ 31 నాటికి రూ.81,516 కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి జెన్ కో స్థాపిత సామర్థ్యం 4,365 మెగావాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నెముక అని అన్నారు.
రవాణా, సమాచార రంగాల మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు భట్టి. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుతేనని చెప్పారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఉత్పత్తి ప్రారంభించిన విద్యుత్ కేంద్రాలే నాణ్యమైన విద్యుత్ అందించాయని తెలిపారు.
విద్యుత్ రంగ అప్పుల మొత్తంలో రూ.30,406 కోట్లు కరెంట్ సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణమని వివరించారు. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ.28,673 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలే అని పేర్కొన్నారు. మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవే రూ.14,193 కోట్లు ఉన్నాయని అన్నారు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల(ట్రూ అప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాట తప్పిన రూ.14,928 కోట్ల భారం వాటి ఆర్థిక స్థితిని మరింత కుంగదీశాయని ఆందోళన వ్యక్తం చేశారు.