గతంతో పోలిస్తే ఈ సారి లోక్ సభ ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ (Congress) అని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. సికింద్రాబాద్ ఈ సారి తమదేనని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రబాద్ సీటును గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ పార్లమెట్ పరిధి బూత్ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావే భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడుతూ….లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతోందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల అభివృద్ధి కోసమే సీఎంతో ప్రత్యేకంగా సమావేశామయ్యారని స్పష్టం చేశారు.
అంతే కానీ అందులో ఇతర అంశాలేవీ లేవని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రజలకు మంచి చేసేది కాంగ్రెస్సేనని అన్నారు. ఆ విషయాన్ని గుర్తించిన ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఉడుత ఊపులకు కాంగ్రెస్ భయపడబోదన్నారు.
ప్రజలు తరిమి కొట్టినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. పరాజయం పొంది ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు గుర్తించుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఎవరొచ్చినా ఇక బీఆర్ఎస్ గట్టెక్కించడం కష్టమన్నారు.