Telugu News » Rebel MLAs : స్పీకర్ నోటీసులను సవాల్ చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు…. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు… !

Rebel MLAs : స్పీకర్ నోటీసులను సవాల్ చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు…. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు… !

అనర్హత పిటిషన్‌పై విచారణకు హాజరవుతామని ప్రకటించిన కొద్ది సేపటికే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ట్విస్ట్ ఇచ్చారు.

by Ramu
ysrcp rebel mlas petition in high court challenging disqualification notice

పార్టీ పిరాయింపుల చట్టం కింద ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (Rebel MLAs) ఏపీ హైకోర్టు (High Court)లో సవాల్ చేశారు. అనర్హత పిటిషన్‌పై విచారణకు హాజరవుతామని ప్రకటించిన కొద్ది సేపటికే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ట్విస్ట్ ఇచ్చారు. స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అనర్హత విచారణ నోటీసులను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

ysrcp rebel mlas petition in high court challenging disqualification notice

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్ల శ్రీదేవీ, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమకు మరింత సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అంతకు ముందు తెలిపారు. కానీ తమకు సమయం ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారని పేర్కొన్నారు.

ఏపీలో స్పీకర్ రూల్ బుక్‌ను కూడా విభజించారని ఆరోపణలు గుప్పించారు. చివరి రోజుల్లోనైనా చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ రామ చంద్రయ్య కూడా పిటిషన్ దాఖలు చేశారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్​పై శాసన మండలి ఛైర్మన్ ఎదుట విచారణకు హాజరు కాకూడదని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్టు మండలి ఛైర్మన్‌కు న్యాయవాది ద్వారా రామచంద్రయ్య లేఖ పంపారు.

ఇక విచారణ అంతా ఒక ప్రహసనంగా ఉందని ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి పేర్కొన్నారు. తమ వాదనలు వినిపించేందుకు 4 వారాల సమయం అడిగామన్నారు. కానీ న్యాయవాదిని నియమించుకునేందుకు కూడా తమకు స్పీకర్ సమయం ఇవ్వలేదని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన ప్రసాద్‌ రాజు కూడా విచారణలో ఉండాలని తాము కోరామన్నారు.

ఇక తన అనారోగ్యంపై వైద్యులు నివేదిక ఇచ్చారని, దాన్ని కూడా స్పీకర్ పట్టించుకోలేదని చెప్పారు. విప్ ఉల్లంఘించామనడానికి వాళ్ల దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించామని ఎలా నిర్ధారించారని నిలదీశారు. ఇక తాను కొవిడ్‌తో బాధపడుతున్నానని తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ పేర్కొన్నారు. అయినప్పటికీ తనను హాజరుకావాలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తన రాజీనామాను నిబంధనల ప్రకారం అనుమతించలేదంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేయగా…దానిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు పంపింది. దీంతో పాటు సీఈసీ, ఎస్‌ఈసీకి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను మూడు వారాల పాటు హైక్ర్టు వాయిదా వేసింది.

You may also like

Leave a Comment