తాను నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చత్తీస్‌ఘడ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ(Deputy CM Vijay Sharma) తెలిపారు. ఆ రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా విజయ్ శర్మ వద్దే ఉన్నాయి. కాగా, రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి విషయంలో నక్సల్స్‌తో వీడియో కాల్ మాట్లాడేందుకు సిద్ధమని చెప్పారు. వాళ్లు ప్రభుత్వం ముందుకు రానిపక్షంలో తానే నేరుగా మాట్లాడతానని తెలిపారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో కారణాన్ని అడుగుతానని వెల్లడించారు.
ప్రతీ గ్రామంలోనూ స్కూళ్లను తెరువాలని తిరుగుబాటుదారులు ఓ లేఖను రిలీజ్ చేయాలని ఆయన కోరారు. అబుజామాద్, నారాయన్‌పూర్ అడవుల్లో ఉంటున్న యువతను కలిశానని చెప్పారు. ముంబైకి వెళ్లి హీరోలు కావాలన్న ఆశ వారిలో ఉందని, కానీ తమ గ్రామంలో అభివృద్ధిని వాళ్లు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం నక్సల్స్‌ను వాడుకుందో వాళ్లే చెప్పాలన్నారు. నక్సల్స్ గురించి ప్రశ్న వేసిన సమయంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాన్ని నక్సల్స్ వ్యతిరేకిస్తుంటారన్నారు. కానీ ఇటీవల రోడ్లు కావాలంటూ వాళ్లు కరపత్రాలను జారవిడిచారని గుర్తు చేశారు.