హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు (Gadala Srinivas Rao).. ఈమధ్య కాలంలో పొలిటికల్ అంశాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొత్తంగూడెం (Kothagudem) నియోజకవర్గం సమస్యలపై ప్రశ్నిస్తూ.. స్థానిక నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారికి రాజకీయాలతో సంబంధం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినా కూడా.. ఆయన తన పంథా మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆయనకు క్లాస్ తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించారు గడల.
కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్స్ చేయొద్దని మంత్రి హరీష్ రావు తనను హెచ్చరించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తనకు ఫోన్ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఆదివారం కూడా కొత్తగూడెంలోనే ఉన్నానని.. డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు.అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించానని అన్నారు.
తన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు డీహెచ్. ఈ క్రమంలోనే తన ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. ప్రజలు, మీడియా మిత్రులు ఈ ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. కొత్తగూడెంలో జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు ఆపనని.. నిరాటంకంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) తనకు ఇన్స్పిరేషన్ అని.. ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు డీహెచ్. అందుకే, చాలారోజులుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల మెప్పు కోసం కులాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.