– పార్టీల పోటాపోటీ మేనిఫెస్టోలు
– ఉచితాలతో ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదమా?
– వచ్చే ఏడాది బడ్జెట్ ఎంత ఉండొచ్చు?
– అలవికాని హామీలిచ్చింది ఎవరు?
– పార్టీల హామీలతో అదనపు భారం ఎంత?
ఎలక్షన్ వస్తే చాలు.. హామీల వర్షంతో ఓటర్లను తడిసి ముద్ద చేస్తాయి పార్టీలు. ప్రలోభాలు, తాయిలాలు, ఉచితాల ప్రభావం అలా ఉంటుంది మరి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పిస్తుంటాయి పార్టీలు. ఎందుకంటే, ఎన్నికల్లో గెలిపించేవి ఉచిత పథకాలేనని గట్టిగా నమ్ముతున్నాయి కాబట్టి. ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోలు విడుదల చేయడం.. నాలుగు ఓట్లు రాబట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాయిలాల స్థాయి పీక్స్ కు చేరిందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనేది బీఆర్ఎస్ ఆశ. దానికి తగ్గట్టే మేనిఫెస్టోలో కీలక హామీలను పొందు పరిచింది. పేదలకు రూ.5 లక్షల వరకు బీమా, ఆసరా పెన్షన్లు రూ.5,016కు పెంపు, రూ.400కే గ్యాస్సిలిండర్, రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంపు, అర్హులైన మహిళలకు రూ.3 వేల చొప్పున భృతి వంటి హామీలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వానికి అదనంగా రూ.52,461 కోట్ల దాకా భారం పడే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ హామీల అమలుపై అనేక సందేహాలు వ్యక్తం అయిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొనగా.. ఆ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. రెండింటిలో కాంగ్రెస్ హామీలే తీవ్ర చర్చకు దారితీశాయి.
అభయ హస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 37 ప్రధాన అంశాలతో 66 హామీలను పొందుపరిచింది. దాదాపు అన్ని వర్గాలను కవర్ చేస్తూ దీన్ని రూపొదించింది. ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్ల నుంచి ప్రధాన హామీలను మేనిఫెస్టోలో పెట్టింది. ఈ భారీ హామీలను పరిశీలిస్తే బడ్జెట్ ఎంతవుతుంది? అంత మొత్తంలో తీసుకురావడం సాధ్యమా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానమని కాంగ్రెస్ నేతలు పోల్చుతున్నా.. అలవికాని హామీలిస్తే ఆచరణకు నోచుకోవని ఇతర పార్టీలు అంటున్నాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వేస్ట్ అని తేల్చేస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, 24 గంటల ఉచిత కరెంట్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం, 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి స్కూటీ, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి, రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, అమరవీరుల కుటుంబంలో ఒకరికి నెలకు రూ.25 వేలు గౌరవ వేతనం ఇలా అనేక హామీలను గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ హస్తానికి అధికారం వస్తే వీటన్నింటినీ అమలు చేయడానికి లక్షల కోట్లు అవసరం అవుతాయనేది నిపుణుల మాట.
2023-24 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈసారి అన్ని రకాల రాబడులు కలిపి రూ.2,59,861 కోట్లు ఉంటాయని అంచనా. ఇందులో ఆగస్టు నాటికి రూ.99,106 కోట్లు మాత్రమే సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల రాబడులు కలిపి రూ.2,45,256 కోట్లు ఉంటాయని అంచనా వేసిన ప్రభుత్వం రూ.2,56,958 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కానీ, రూ.1,92,097 కోట్లు మాత్రమే సమకూరినట్లు కాగ్ కు నివేదించిన వివరాల్లో వెల్లడించింది. అందులోనూ పన్నుల ద్వారా రూ.1,26,617 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర పన్నుల్లో వాటా కింద మరో రూ.13,994 కోట్లు వచ్చాయి. అంటే నికరంగా సమకూరిన ఆదాయం రూ.1,40,611 కోట్లు మాత్రమే. భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా మరో రూ.19,553 కోట్లను సమకూర్చుకుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను కలిపితే రాష్ట్ర నికర రాబడులు రూ.1.51 లక్షల కోట్లు. ఇందులో నుంచే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలకు దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. మిగతా సొమ్మును సంక్షేమ పథకాలు, ఇతర అడ్వాన్సులు, ఉద్యోగుల రుణాలకు సర్దాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రాబడులు, చెల్లింపుల్లో 15-20 శాతం మేర పెరుగుదల ఉండొచ్చు.
ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ హామీలతో అదనపు భారాన్ని పెంచబోతున్నందున బడ్జెట్ ను కూడా పెంచాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. అదనపు భారం కలిపి రూ.3.5 లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ను పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. కానీ, రాష్ట్ర రాబడులు మాత్రం రూ.2 లక్షల కోట్లకు మించడం లేదని.. మరి, మిగతా సొమ్ము ఏం చేస్తారు..? ఇచ్చిన హామీలు అమలవుతాయా? అనే ప్రశ్నలను వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు ఎలా ఉన్నా పోటీపడి ప్రకటిస్తున్న ఉచితాలు కచ్చితంగా రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో అప్పుల కుప్పగా మారుస్తాయని అంటున్నారు. వనరుల సంపూర్ణ వినియోగం భవిష్యత్తుకు అంధకారాన్ని మిగల్చక తప్పదని… ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వల్ల కనీసం జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని వివరిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా స్థిరాస్తులు ఆపద కాలంలో ఆర్థిక వ్యవస్థను ఆదుకునే సంజీవనిలా ఉండాలి కానీ రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం అమ్ముకోగలిగే వనరులుగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడి ఉచితాల ప్రకటన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావాన్ని చూపుతాయని వివరిస్తున్నారు మేధావులు.