Telugu News » Kaleswaram : జనం సొమ్ము.. కాంట్రాక్టర్ల జేబుల్లోకి..!

Kaleswaram : జనం సొమ్ము.. కాంట్రాక్టర్ల జేబుల్లోకి..!

ధరల సవరణల రూపంలో రూ.1,343 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినట్టు కాగ్ వెల్లడించింది. ప్యాకేజీ 18లో ప్రభుత్వం టన్నెల్ పొడవును తగ్గించి, సంబంధిత పనులనూ తగ్గించింది. కానీ, ఆ విషయంలో అంచనాల ధరను మాత్రం తగ్గించలేదని వివరించింది. ఫలితంగా కాంట్రాక్టర్‌ కు రూ.94.32 కోట్ల అనధికారిక ప్రయోజనం చేకూరింది. అదేవిధంగా ప్యాకేజీ 17 టన్నెల్ పనుల్లోనూ రూ.50 కోట్లు అదనంగా చెల్లించారని చెప్పింది.

by admin
kaleswaram

– కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక అక్రమాలెన్నో!
– అన్నీ తేల్చేందుకు రంగంలోకి విజిలెన్స్
– మేడిగడ్డ, కన్నేపల్లి కార్యాలయాల్లో విస్తృత సోదాలు
– హైదరాబాద్ లోనూ తనిఖీలు
– జరిగిన అవినీతి లెక్కలన్నీ ముందే వివరించిన కాగ్
– వేల కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు
– మేఘా, ఎల్ అండ్ టీ, నవయుగ సంస్థలకు రూ.7,500 కోట్ల ప్రయోజనాలు
– 4 ప్యాకేజీల్లో అదనంగా రూ.5,188.43 కోట్లు చెల్లించిన కేసీఆర్ ప్రభుత్వం
– మరో 17 ప్యాకేజీలు ఆడిట్ చేయాల్సి ఉందన్న కాగ్
– ఆ మొత్తం కలిపితే మరింత ఎక్కువగా ఉండే అవకాశం
– ప్యాకేజీ 16లో 89 కి.మీ. కాలువను 57 కి.మీ. కుదింపు
– కానీ, 89 కి.మీ. డబ్బులు చెల్లించిన సర్కార్
– ప్యాకేజీ 12లో 182 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమైతే..
– అంచనాల్లో 13,048 మెట్రిక్ టన్నులుగా చూపించిన వైనం
– రోడ్ల నిర్మాణంలో రూ.66.29 కోట్లు
– డీవాటరింగ్ ఛార్జీల కోసం రూ.29.01 కోట్లు
– మెటల్ కొనుగోలు కోసం అదనంగా రూ.26.46 కోట్లు
– ధరల సవరణ అంటూ రూ.1,343 కోట్ల చెల్లింపులు
– పైప్ ఇరిగేషన్ సిస్టమ్ కోసం మట్టి తవ్వకం, రవాణా అంటూ రూ.21 కోట్లు
– మట్టి రవాణా అవసరమే లేని చిన్న పైపు వేసి డబ్బు పక్కదారి
– కాగ్ రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుందా?
– బీఆర్ఎస్ పెద్దలు, కాంట్రాక్ట్ సంస్థలపై చర్యలుంటాయా?

కాళేశ్వరంపై ఆడిట్ నివేదికలో కాగ్ సంచలన విషయాలను వెల్లడించింది. ప్రాజెక్టులో పంపులు, మోటార్లు, సహాయ పరికరాల సరఫరా పేరిట 4 ప్యాకేజీల్లో అదనంగా రూ.5,188.43 కోట్లకు పైగా కేసీఆర్ ప్రభుత్వం చెల్లించినట్టు వెల్లడించింది. మరో 17 ప్యాకేజీలు ఆడిట్ చేయాల్సి ఉన్నందున ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. 2022 ఆడిట్ సమయంలో 17 ప్యాకేజీల్లో నాలుగింటిలో పనులు పురోగతిలో ఉన్నాయి. అప్పుడు 13 ప్యాకేజీలకు సంబంధించిన ఇన్‌ వాయిస్‌ లను ఆడిటింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం అందించలేదు. దీంతో కాంట్రాక్టర్లకు చేసిన అదనపు చెల్లింపుల గురించి పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయినట్టు కాగ్ పేర్కొంది.

cm-revanth-reddy-sensational-decision-on-kaleshwaram-project

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కూపమంటూ బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు చేశాయి. వీటికి బలం చేకూర్చేలా కాగ్ నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఎల్ అండ్ టీ, నవయుగ వంటి సంస్థలకు రూ.7,500 కోట్ల ప్రయోజనాలను అక్రమంగా చేకూర్చిచినట్టు తేల్చింది. మేడిగడ్డ బ్యారేజీలో ఎల్‌ అండ్‌ టీ కి రోడ్ల నిర్మాణంలో రూ.66.29 కోట్లు, డీవాటరింగ్ ఛార్జీల కోసం రూ.29.01 కోట్లు, మెటల్ కొనుగోలు కోసం అదనంగా రూ.26.46 కోట్లు చెల్లించినట్లు కాగ్ స్పష్టం తెలిపింది.

the telangana government will conduct an inquiry into the construction of the kaleshwaram project

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు అయినట్టు బీఆర్ఎస్ చెబుతోంది. కానీ, ప్రాజెక్టు మొత్తం వ్యయం 1.5 లక్షల కోట్లు దాటుతుందని ఆడిట్ నివేదిక అంటోంది. కాళేశ్వరం వ్యయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే కాంట్రాక్టర్లకు అక్రమంగా ఎంత చెల్లించారనే విషయంపై సరైన వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది కాగ్. ధరల సర్దుబాట్లు, అంచనా వ్యయాలను పెంచడం, మరీ ముఖ్యంగా పని పరిధిని తగ్గించిన తర్వాత కూడా అంచనాలను తగ్గించకపోవడం వంటి పలు మార్గాల్లో ప్రభుత్వ నిధులను మింగేశారని తేల్చింది. 2008లో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి పంపులు, మోటార్లు, సహాయక పరికరాల కోసం ధరల అంచనాలను అప్పటి ప్రభుత్వం తీసుకుందని పేర్కొంది. కానీ నీటిపారుదల సలహాదారు అందించిన ఇన్ పుట్ ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసిందని వివరించింది. ఆ ధరల అంచనాలు ఎలా వచ్చేయనే దానిపై నీటిపారుదల శాఖకు అవగాహన లేదని తెలిపింది. ఫలితంగా కాంట్రాక్ట్ సంస్థలు ప్రయోజనం పొందాయని తెలిపింది.

telangana-ministers-in-medigadda-kaleshwaram-loopholes-to-be-revealed 1

అంచనా వ్యయంలో రూ.7,214 కోట్ల పరికరాల కోసం బీహెచ్ఈఎల్ కు రూ.1,686 కోట్లు చెల్లించారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్‌ కు రూ.5,188.43 కోట్ల అనవసర ప్రయోజనాన్ని చేకూర్చారని పేర్కొంది కాగ్. ప్రీ-బిడ్డింగ్ మీటింగ్‌ లో ధరల సర్దుబాటు(అంతర్జాతీయ మార్కెట్‌ లో రూపాయి విలువలో మార్పుల సందర్భంలో)ను నిరాకరించినప్పటికీ ఆ తర్వాత విజయవంతమైన బిడ్డర్‌ కు ఎలక్ట్రో-మెకానికల్, హైడ్రో-మెకానికల్ పరికరాల కోసం ధరల సర్దుబాట్లను అనుమతించారని తెలిపింది. ధరల సవరణల రూపంలో రూ.1,343 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినట్టు కాగ్ వెల్లడించింది. ప్యాకేజీ 18లో ప్రభుత్వం టన్నెల్ పొడవును తగ్గించి, సంబంధిత పనులనూ తగ్గించింది. కానీ, ఆ విషయంలో అంచనాల ధరను మాత్రం తగ్గించలేదని వివరించింది. ఫలితంగా కాంట్రాక్టర్‌ కు రూ.94.32 కోట్ల అనధికారిక ప్రయోజనం చేకూరింది. అదేవిధంగా ప్యాకేజీ 17 టన్నెల్ పనుల్లోనూ రూ.50 కోట్లు అదనంగా చెల్లించారని చెప్పింది.

ప్యాకేజీ 9లో అదనంగా రూ.48 కోట్ల సర్వే ఛార్జీలు చెల్లించారని తెలిపింది కాగ్. ప్యాకేజీ 21ఏ లోని ప్రెజర్డ్ పైప్ ఇరిగేషన్ సిస్టమ్ కోసం, పైప్‌ లైన్‌ కు ఒక కిలోమీటరు దూరంలో గుర్తించిన ప్రదేశాల్లో మట్టిని తవ్వి పారవేసేందుకు రూ.21 కోట్లు చెల్లించారని వివరించింది. కానీ, వేసిన పైపు చాలా చిన్నదిగా ఉందని, దీనికి మట్టి తవ్వకం, రవాణా అవసరం లేదని కాగ్ గుర్తించింది. ఇటు ప్యాకేజీ 16లో కాలువ పొడవును 89 కిలో మీటర్ల నుంచి 57 కిలో మీటర్లకు కుదించగా, ప్రభుత్వం 89 కిలో మీటర్లకు డబ్బులు చెల్లించిందని తేలింది. దీని కారణంగా కాంట్రాక్టర్‌ కు రూ.117 కోట్ల అక్రమ ప్రయోజనం అందింది. లింక్ 4 లోని ప్యాకేజీ 12లో టన్నెల్ నిర్మాణంలో ఉపయోగించిన ఉక్కు పరిమాణం వాస్తవానికి 182 మెట్రిక్ టన్నులు అవసరం. కానీ, అంచనాల్లో దీన్ని 13,048 మెట్రిక్ టన్నులుగా చూపించారని చెప్పింది కాగ్. దీని కారణంగా కాంట్రాక్టర్‌ కు అదనంగా రూ.64.98 కోట్లు చెల్లించారని స్పష్టమైంది. ప్యాకేజీ 15లో అదనపు పనుల విలువను రూ.58 కోట్లు పెంచినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా వివరించింది. ఈ లెక్కలన్నీ తేల్చి కాంట్రాక్ట్ సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

Shocking Facts on Kaleshwaram Project

కాళేశ్వరంపై మొదట్నుంచి వివాదాలే. రూల్స్ ను అతిక్రమించి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని.. కేసీఆరే ఇంజినీర్ గా మారి నిర్మాణాలు చేపట్టారని.. నాసిరకం పనులు జరిగాయని.. వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని.. ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతంలో కాళేశ్వరంపై గగ్గోలు పెట్టిన హస్తం పార్టీ.. ప్రజెంట్ అధికారంలో ఉండడంతో లెక్కలన్నీ తేలుస్తామని అంటోంది. ఎవర్నీ వదలమని జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తామని చెబుతోంది. ఇదే క్రమంలో మేడిగడ్డ వ్యవహారంపై విజిలెన్స్ బృందం రంగంలోకి దిగడంతో కాళేశ్వరంపై మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాగ్ నివేదికపైనా తెగ మాట్లాడుకుంటున్నారు.

You may also like

Leave a Comment