Telugu News » Maharashtra : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి.. పొత్తులతో తప్పని తిప్పలు..!!

Maharashtra : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి.. పొత్తులతో తప్పని తిప్పలు..!!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలని శివసేన డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే ట్విటర్ వేదికగా సీట్ల పంపకాలపై జరుగుతున్న వివాదం ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. దీంతో శివసేన-కాంగ్రెస్ మధ్య దూరం పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

by Venu

కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ (BJP)ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా (India) కూటమిలోని అభ్యర్థులంతా ఒక మాటమీద లేనట్టు ప్రచారం జరుగుతోంది. ఏ దారి లేని వాడికి, గోదారి గతి అనే సామెతలా వివిధ పార్టీలు ఒకచోట చేరి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.. అయితే ఈ పార్టీలో ఎవరికి వారే ప్రధాన మంత్రి పీఠాన్ని ఆశిస్తున్నట్టు పలు మార్లు వార్తలు వచ్చాయి.. మరోవైపు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో (Lok Sabha Elections) బీజేపీని ఢీకొట్టేలా ముందుకు వెళ్లాలని నేతలు ఆశిస్తున్నా.. ఎదురవుతోన్న అంతర్గత వివాదాలు పార్టీని ముందుకు కదలకుండా చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి..

ముఖ్యంగా మహారాష్ట్ర (Maharashtra)లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ (Congress).. శివసేన మధ్య ప్రస్తుతం వైరం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలని శివసేన డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే ట్విటర్ వేదికగా సీట్ల పంపకాలపై జరుగుతున్న వివాదం ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. దీంతో శివసేన-కాంగ్రెస్ మధ్య దూరం పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి విజయాన్ని అందించగల అభ్యర్థులు లేరని కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను తిరస్కరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు.. రాష్ట్రంలో శివసేన అతిపెద్ద పార్టీ అని చెప్పిన ఆయన.. ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు.

అయితే పొత్తులు లేకుండా.. వివాదాలతో ముందుకు వెళ్ళితే బీజేపీని ఢీ కొట్టడం అసాధ్యం అనే భావన, ఇండియా కూటమిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే నేతలు జాగ్రత్తగా వ్యవహరించాలనే భావనలో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవరా, ఏదైనా పొత్తుతో ముందుకు వెళ్లే ముందు స్థానిక నాయకత్వం పై చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వెనుకంజ వేయడం లేదు.. టీఎంసీ మాత్రమే బీజేపీని ఓడించగలదని, అందుకే మిగతా రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ ఇప్పటికే కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని, సమాజ్ వాదీ పార్టీ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బీజేపీ అపజయం మాట అటుంచితే.. లోక్‌సభ ఎన్నికల్లో, విపక్ష కూటమికి, ముఖ్యంగా కాంగ్రెస్‌కు విజయం అంత సులువుగా దక్కే పరిస్థితులు లేవనే అనుమానాలు కొందరిలో బలపడుతున్నాయి..

You may also like

Leave a Comment