దేశ వ్యాప్తంగా దీపావళి (Diwali)ని ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్దం అవుతున్నారు. కాగా పండుగ అంటే అందరికీ సమానమే.. అందుకే ఇలాంటి సమయాల్లో రాజకీయ నేతలైన, సెలబ్రిటీలైన, కామన్ పీపుల్ అయిన సరే అందరూ ఒకే విధంగా పండుగ జరుపుకుంటారు. ఇక దీపావళికి కావలసిన వస్తువుల కోసం సామాన్యులు వెళ్ళడం పరిపాటే. అదే వీఐపీ హొదాలో ఉన్న వారు స్వయంగా వెళ్ళితే.. అది వార్త అవుతుంది.
ప్రస్తుతం ఇలాంటి వార్త మనముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి (Chief Minister) పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami)దీపావళి ఉత్పత్తులు ఉన్నచోటుకి వెళ్ళి స్వయంగా మట్టి దీపాలను కొనుగోలు చేశారు.. దీపావళి సందర్భంగా కుమ్హర్ మండి ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి.. మట్టి దీపాలను, ఇతర వస్తువులను సిద్ధం చేసే కుమ్మరులను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి చేశారు..
మరోవైపు సాధ్యమైన చోటల్లా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘వోకల్ ఫర్ లోకల్’ అనే నినాదాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని ఈ దీపావళి నాడు స్థానిక ఉత్పత్తులను వీలైనంతగా ప్రచారం చేస్తూ.. భారతదేశం సంకల్పం నెరవేరడానికి మనమందరం సహకరించాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఇలా చేయడం వల్ల మన సంప్రదాయ ఉత్పత్తులకు కూడా గుర్తింపు వస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలు స్థానిక ఉత్పత్తుల కొనుగోలుపై శ్రద్ధ పెడితే మన దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని, స్థానిక ఉత్పత్తిదారుల శ్రేయస్సు కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు.