రాజుల కాలం నుంచి ప్రజలకు సేవ చేసే యువ రాజులు, యువరాణిల గురించి ఇప్పటివరకు కథల్లోనే విన్నాం. అయితే నిజజీవితంలోనూ ఇప్పటికీ రాజవంశస్థులు ప్రజా సేవలో ఉన్నారంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజంగా నిజం. సాధారణంగా యువరాణులు బయట కనిపించరు. బయట అడుగు కూడా పెట్టరు.
అయితే రాజస్థాన్(Rajasthan)లో మాత్రం ఓ యువరాణి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటోంది. అందుకే ఆమెను అక్కడి ప్రజలు ‘వీధుల్లో నడిచే యువరాణి (princess who walks on the streets)’ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. రాజస్థాన్ యువరాణి దియా కుమారి. చూపుతిప్పుకోనివ్వని అందం, హుందాతనంతో మహారాణిలా కనిపించే దియా కుమారి ఒక్కసారిగా దేశంలోనే హాట్ టాపిక్ అయ్యారు.
దీనికి కారణం ఇప్పుడామె రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రి. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకుటుంబం నుంచి వచ్చిన దియాకుమారికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడంతో అందరి చూపు ఒక్కసారిగా ఆమె వైపు మళ్లింది. ఇక ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ స్థానం నుంచి దియా కుమారి 71,368 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తొలుత రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆమే అని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ ఆమెను డిప్యూటీ సీఎంను చేసింది.
దియా కుమారి జనవరి 30, 1971న రాజస్థాన్‌లోని రాజ కుటుంబంలో జన్మించారు. ఆమె తాత, మాన్ సింగ్ II, బ్రిటీష్ రాజు కాలంలో జైపూర్‌ని పాలించే చివరి మహారాజు. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. మహావీర చక్ర అవార్డునూ అందుకున్నారు. ఇక దియా కుమారి జైపూర్‌లోని మహారాణి గాయత్రీ దేవి స్కూల్‌లో తన ప్రాథమిక విద్యను ఆపై కాలేజీ చదువులు మహారాణి కళాశాలలో పూర్తి చేశారు.
2013లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా దియాకుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 2019లో ఎంపీగా రాజ్‌సమంద్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. దియా వ్యాపార రంగంలోనూ దిట్ట. పాఠశాలలు, ట్రస్టులు, మ్యూజియంలు, హోటళ్లు వంటి వ్యాపారల్లోనూ రాణించారు. దియా వ్యక్తిగత జీవితానికి వస్తే.. నరేంద్ర సింగ్ అనే వ్యక్తిని వివాహమాడిన ఆమెకు ముగ్గురు పిల్లలు. 2018లో ఆమె తన భర్తకు విడాకులిచ్చారు.