పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షాలు ఈ సమావేశాలు ఎందుకని నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ప్రధాని మోడీ (PM Modi) కి లేఖ కూడా రాశారు. అజెండా ఏంటో చెప్పాలని అడిగారు. అయితే.. జమిలీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేంద్రం.. ఈ సమావేశాల్లో బిల్లు తీసుకురానుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తెలంగాణలో ఎన్నికలు ఆలస్యం అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే.. బీజేపీ (BJP) నేతలు దీన్ని ఖండిస్తున్నారు.
తెలంగాణలో డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna). బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. గతేడాది లాగే ఈసారి కూడా 17న సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద దీక్ష ఉంటుందన్న ఆమె.. నిరుద్యోగులను కేసీఆర్ (KCR) మోసం చేశారని విమర్శించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చాలనే డిమాండ్ తో దీక్ష చేస్తున్నట్టు తెలిపారు డీకే అరుణ. అలాగే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 15న హైదరాబాద్ లో, 16న అన్ని జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేపడతామని స్పష్టం చేశారు. ఎంఐఎం స్నేహం కోసమే విమోచన దినోత్సవం జరుపకుండా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో బంగారు కుటుంబాన్ని తయారు చేసుకున్నారని ఆరోపించారు డీకే అరుణ.