డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ (KCR), ఇప్పుడు మాయమైపోయారు. సెంటిమెంట్ పేరుతో నిరుద్యోగ యువత ప్రాణాలు బలి తీసుకున్నారు. ఆయనది 12 వందల మంది ఉసురుపోసుకొని గద్దెనెక్కిన చరిత్ర. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులను నిరుద్యోగులుగానే ఉంచారు. యువత ఆశలను నెరవేర్చలేదు.
ఇప్పటి వరకు డీఎస్సీ (DSC) వేయకపోవడం దుర్మార్గం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం సిగ్గు చేటు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ప్రశ్నా పత్రాలు లీక్ చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. లీక్ (Paper Leak) చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉన్నట్లే కదా. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారు. ప్రకటనల పేరుతో పాలాభిషేకాలు చేయించుకోవడానికి కేసీఆర్ కు సిగ్గు ఉండాలి. తెలంగాణ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలు ఎక్కడికి పోయాయి? ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్. ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిగ్గు లేదా? తెలంగాణలో విప్లవం మొదలైంది కేసీఆర్. నీ పతనం తథ్యం. రాష్ట్రంలో మార్పు జరగాలి. అది బీజేపీతోనే సాధ్యం.