ఇజ్రాయెల్ పై (Israel) హమాస్ (Hamas) ఉగ్రవాదులు (terrorist).. వేల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో చాలా వాటిని ఐరన్ డోమ్ (Iron Dome) అడ్డుకుంది. కేవలం 22 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. లేదంటే ఇజ్రాయెల్ లో పెను విధ్వంసం జరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి..ఎలా పనిచేస్తుంది అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఆ వివరాలు గమనిస్తే..
ఆకాశంలో నుంచి దూసుకొచ్చే రాకెట్లు, ఇతరత్రా క్షిపణులను ముందుగానే గుర్తించి, వాటిని మధ్యలో కూల్చేసే యాంటీ మిసైల్ సిస్టమే ఈ ఐరన్ డోమ్.. ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టం, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థను 2011లో ప్రవేశపెట్టారు. కాగా ఈ ఐరన్ డోమ్ మొబైల్ మిస్సైల్ డిఫెన్స్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది.
ఈ వ్యవస్థలో మూడు కాంపొనెంట్స్ ఉంటాయి. అవి.. రాడార్, కమాండ్ కంట్రోల్ సిస్టం, ఇంటర్ సెప్టార్.. కాగా మొదటి లెవల్లో ఇజ్రాయెల్ భూభాగంవైపు దూసుకొచ్చే రాకెట్లను రాడార్ సాయంతో గుర్తించడం జరుగుతుంది. ఆ రాకెట్ పయనించే మార్గాన్ని పరిశీలించి దాని టార్గెట్ ను గుర్తించడంతో పాటు అడ్డుకునేందుకు కమాండ్ కంట్రోల్ సిస్థం ఉపయోగపడుతుంది. కమాండ్ కంట్రోల్ సూచనలతో రాకెట్ పై ఎదురుదాడి చేసేందుకు ఇంటర్ సెప్టర్ పనిచేస్తుంది. అయితే దాదాపు 60 మైళ్ల దూరం వరకు పని చేసే ఈ వ్యవస్థ డిటెక్ట్, ప్రిడిక్ట్, అసెస్, ఇంటర్సెప్ట్ అన్న రీతిలో తన పని తాను చేసుకుపోతుంది.
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో అతి కీలకమైన విషయం ఏమిటంటే.. శత్రువులు ప్రయోగించిన రాకెట్ లక్ష్యాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు, సదరు రాకెట్ తన టార్గెట్ ను చేరగలదా లేదా అనేది కూడా క్షణాలలో లెక్కలేస్తుంది. ఆ టార్గెట్ లో పౌరులు కానీ, కీలకమైన భవనాలు కానీ ఉంటే వెంటనే ప్రతిస్పందించి ఎదురుదాడి చేస్తోంది. అలా కాకుండా శత్రువుల రాకెట్ ఎంచుకుని టార్గెట్ చేరినప్పటికీ ,ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం లేదని తేలితే, ఎదురుదాడి చేయదు. అంటే శత్రువుల రాకెట్ ను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తుంది. దీనివల్ల ఆయుధ నష్టాన్ని నివారిస్తుంది.
ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థకు 95.6 శాతం సక్సెస్ రేటు ఉన్నట్టు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి. ఈ ఐరన్ డోమ్ రూపకల్పన 2007లో జరగగా, 2008, 2009లో పరీక్షించారు. 2011లో తొలిసారి ఐరన్ డోమ్ బ్యాటరీలను కదన రంగంలోకి దింపారు. ఆ తర్వాత అనేక సార్లు ఆ ఐరన్ డోమ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఐరన్ డోమ్ బ్యాటరీలను రాఫేల్‌తో పాటు రేథియాన్ సంస్థలు రూపొందించాయి.
సుమారు 11 కిలోల పేలుడు పదార్ధాన్ని మోసుకెళ్లగల సామర్ధ్యం ఐరన్ డోమ్‌లో ఉండే వార్‌హెడ్ కి ఉంది. కాగా యుద్ధం సమయంలో ఐరన్ డోమ్ నిర్వహణ ఖర్చు మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క మిస్సైల్ ఖర్చు సుమారు 40 వేల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఇజ్రాయిల్ రూపొందించిన ఐరన్ డోమ్ ప్రోగ్రామ్ కోసం అమెరికా సుమారు 2.9 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్టు చెబుతోంది.