కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు వరుసగా కామెంట్స్ చేస్తుండటంపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister komati reddy venkata reddy)స్పందించారు. గురువారం నల్లగొండ జిల్లాలోని ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి.. ఈ సందర్బంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ కుల,మతాల మధ్య ఘర్షణలు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తుందని తెలిపారు. ఇవి దేశ ఐక్యత కోసం జరగాల్సిన ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే పదేళ్లు అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పదేళ్లు ఉంటారని స్పష్టంచేశారు.
తమ పార్టీలో ఏకనాథ్ షిండేలు లేరని, గ్రూపులు కూడా లేవన్నారు.తాము అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు.ఏక్నాథ్ షిండేను సృష్టించింది బీజేపీ పార్టీయే అని కోమటిరెడ్డి వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలికారు. పనికిరాని చిట్ చాట్లు బంద్ చేయాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని, గెలిస్తే తాను దేనికైనా సిద్ధం అని సవాల్ విసిరారు. మా పార్టీ అంతర్గత విషయాలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని హితవు పలికారు. బీజేపీలో ఏం జరుగుతుందో చూసుకోవాలని, అసలు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్‌ను మార్చి కిషన్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? అని ప్రశ్నించారు.