నేటి కాలంలో జంతువులకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండటం లేదని జగం ఎరిగిన సత్యం.. అసలు మనిషిలో మానవత్వం.. మనసులో ప్రేమ.. దయ ఉంటే చాలని.. హృదయంలో కరుణ.. జాలి ఉంటే చాలని.. చెలిమిలో స్నేహితుల విలువ తెలిస్తే చాలని మంచి హృదయాలు ఆశిస్తాయి. కానీ కఠినత్వం ముసుగు ధరించి.. పైకి విషపు నవ్వులు చిందిస్తున్న మనుషుల కంటే.. కుక్కలు (Dogs) నయం అని ఎన్నో సార్లు నిరూపించుకున్నాయి.
ప్రస్తుతం మనం చదవబోయే మ్యాటర్ కూడా అలాంటిదే.. తనను సాకిన యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. అతడి కోసం నాలుగు నెలలుగా నిరీక్షిస్తోంది. మనసున్న హృదయాన్ని కలచివేసే ఈ సంఘటన కేరళ (Kerala)లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి (Government-Hospital)లో జరిగింది. నిత్యం తనను గారాబంగా చూసుకునే తన యజమాని అస్వస్థతకు గురై కన్నూర్ (Kannur)జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో.. ఆ శునకం కూడా అతనితో పాటు ఆస్పత్రికి వచ్చింది..
అయితే చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు. దీంతో ఆ మృతదేహాన్ని మార్చురీ (Mortuary)కి తరలించారు ఆస్పత్రి సిబ్బంది. ఈ విషయం తెలియని ఆ కుక్క లోపలి నుంచి తన యజమాని తిరిగి వస్తాడని.. మార్చురీ ముందు నాలుగు నెలలుగా ఎదురుచూస్తోంది. ఎన్నిసార్లు ఆ పెంపుడు కుక్కను అక్కడ నుంచి తరిమిన మళ్లీ వచ్చేస్తోందని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు.. కన్నవారు మరణిస్తేనే నాలుగు రోజుల్లో మరచిపోయే మనుషులున్న సమాజంలో ఒక నోరు లేని జీవి తపన చూస్తుంటే మానవత్వం విలువ తెలిసిన వారు కొంతైనా స్పందిస్తారని ఆశిస్తున్నారు కొందరు..