బంగారు తెలంగాణ.. ఇది కేసీఆర్ (KCR) నినాదం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా, తెలంగాణ అభివృద్ధే తమ లక్ష్యమని గత రెండు పర్యాయాలుగా చెబుతూ వస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. కానీ, అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరడం లేదని.. సారు పాలనలో సర్వం మాయ అంటూ విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు. ఆఖరికి వీధికుక్కలను కంట్రోల్ చేయడంలో కూడా సర్కార్ ఫెయిలవుతోందని.. ఆ పాపమే ఎందరో చిన్నారులకు శాపంగా మారిందని విమర్శిస్తున్నారు.
తాజాగా జగిత్యాల (Jagtial) జిల్లాకు చెందిన 12ఏళ్ల సాహిత్య కుక్క (Dog) దాడితో చనిపోయింది. దీంతో మరోసారి వీధికుక్కల అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 15 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాహిత్యను ఓ కుక్క దాడి చేసి గాయపరిచింది. ఆ చిన్నారితో పాటు దాదాపు 10 మందిపై అది దాడి చేసింది. తీవ్ర గాయాలైన సాహిత్యను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందింది. సాహిత్య మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. గ్రామంలో కుక్కలు చాలా మందిపై దాడి చేస్తున్నాయని, ఇందుకు సబంధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
కొన్నాళ్లుగా తెలంగాణలో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇన్నాళ్లూ నగరాలకే పరిమితమైన దాడులు గ్రామాల్లో కూడా అధికం అవుతున్నాయి. కానీ, ప్రభుత్వం, అధికారులు మాత్రం నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
1. హైదరాబాద్
ఫిబ్రవరిలో అంబర్ పేటలో నాలుగేళ్ల ప్రదీప్ అనే బాలుడు కుక్కల దాడిలో చనిపోయాడు.
2. ఖమ్మం
మార్చిలో రఘునాథపాలెం మండలంలోని పుఠానీతండాలో ఐదేళ్ల బానోతు భరత్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయగా మృతి చెందాడు.
3. హన్మకొండ
– మే నెలలో కాజీపేటలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. 13 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపేశాయి.
4. హన్మకొండ
– జులైలో హన్మకొండలో కుక్క దాడిలో గాయపడిన 18 నెలల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
5. జగిత్యాల
– గొల్లపల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో 12 ఏళ్ల సాహిత్య కుక్క దాడితో చనిపోయింది.
ఇవే కాదు, గత ఆరు నెలల్లో కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని అంచనా. విచ్చలవిడిగా వీధికుక్కలు రెచ్చిపోతున్నా.. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం.. కాసేపు విచారం వ్యక్తం చేసి వదిలేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే విమర్శలు ప్రతిపక్షాల సైడ్ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.