రెండోసారి అమెరికా (America) అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు అపశకునాలు వరుసగా పలకరిస్తున్నాయి.. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. అటు కోర్టు కేసుల్లో సైతం వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా న్యూయార్క్ (New York) కోర్టు ట్రంప్‌నకు సివిల్ ఫ్రాడ్ కేసులో 355 మిలియన్ డాలర్ల భారీ జరిమానా (Fine) విధించింది.
ఇది భారత కరెన్సీలో రూ. 2,946 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు న్యూయార్క్ కార్పొరేషన్లో డైరెక్టర్‌గా లేదా అధికారిగా పనిచేయకుండా ట్రంప్‌పై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. ఇక మాజీ అధ్యక్షుడు తన నికర ఆస్తుల విలువలను ఎక్కువగా చూపించి బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం ఆయనపై ఉంది.
ఈ అంశంపై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మోసపూరితంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలతో తన ప్రాజెక్టులు పూర్తి చేశారని ఆరోపించారు. ఆయనకు కనీసం 370 మిలియన్ డాలర్లు జరిమానా విధించాలని న్యాయమూర్తిని జేమ్స్ కోరారు. మరోవైపు ఈ కేసుపై న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ రెండు నెలల క్రితమే విచారణ చేపట్టి తీర్పును రిజర్వు చేసి ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం తీర్పును వెల్లడించారు..