పదవి లేకపోతే పులి లాంటి మనిషి కూడా పిల్లిలా మారి పడరాని పాట్లు పడతాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను చూస్తే అర్థం అవుతోందంటున్నారు. ఇదివరకే అనాలోచిత నిర్ణయాలు, అసబంధమైన విధానాలతో నిరంతరం వార్తలో నిలిచిన ట్రంప్.. అధ్యక్షపదవి నుంచి తప్పుకొన్నాక.. ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. పదవి పోయాక వ్యాపారాల్లో బిజీ అవ్వాలనుకొన్న అది సాధ్యం కాలేదు.. దీంతో మళ్ళీ రాజకీయాల్లో ఎంటర్ అయ్యి బిజీగా మారారు.
ఈ క్రమంలో రిపబ్లికన్ (Republican) అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం నమోదు చేశారు. అయోవా కాకసస్ (Iowa Caucasus)లో ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యం కనబర్చారు. పార్టీపై తనకు ఏమాత్రం పట్టు తగ్గలేదని నిరూపించుకున్నారు. ఈమేరకు వరుసగా మూడోసారి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
మరోవైపు రెండో స్థానం కోసం ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ (Nikki Haley) పోటీ పడుతున్నారు. బరిలో ఉన్న మరో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక నెల రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం జరిగే ఎన్నికల్లో ఇది తొలి ఎలక్షన్ కావడం గమనార్హం. ఇందులో పైచేయి సాధించిన వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థితో పోటీ పడతారు.
ఈ నేపథ్యంలో వరుసగా మూడోసారి కూడా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవాలని ఆశపడుతున్న డొనాల్డ్ ట్రంప్.. అందులో భాగంగా కాకస్‌లో జరిగిన పోటీలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ ఫలితాలను బట్టి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ట్రంప్‌నకే దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ట్రంప్ కాస్త వెనకబడ్డారు.