అయోధ్య (Ayodhya)లో రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నాయి. మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పనులు వేగం పుంజుకున్నాయి. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణ ప్రతిష్ట (Consecration) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా ట్రస్టు అంచనా వేస్తోంది.
ఇప్పటికే గర్బగుడి పనులు పూర్తయ్యాయని రామ్ మందిర్ ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. రామ్ లల్లా విగ్రహం కూడా రెడీగా ఉందన్నారు. కానీ ఇంకా ఆలయ నిర్మాణంలో చాలా పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఆలయం నిర్మాణం పూర్తయ్యేందుకు మరో రెండేండ్ల సమయం పడుతుందని చెప్పారు. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులు రెడీ అవుతున్నారు.
జనవరి 22న అయోధ్య ఆలయానికి రావద్దని చంపత్ రాయ్ కోరారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, ఈ నేపథ్యంలో అయోధ్యలో రద్దీని నివారించేందుకు తాము ఈ సూచన చేస్తున్నామన్నారు. అయోధ్యకు బదులుగా జనవరి 22న మీ సమీపంలోని రామాలయానికి వెళ్లి ఆనంద మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16న ప్రారంభమవుతాయని ట్రస్టు పేర్కొంది.