యువతి ఆత్మహత్యకు కారణమైన పుష్ప నటుడు (Pushpa Actor) బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్ (Jagadeesh_Prathap Bandari)ను ఇటీవల పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఈ మేరకు జగదీశ్ కీలక విషయాలు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి మరొకరికి దగ్గరవడం భరించలేక.. మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకే ఆమె ఫొటోలు తీసి భయపెట్టానని జగదీశ్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారాం. సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చిన జగదీశ్‌కు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు.
ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో జగదీశ్‌కు సినిమా అవకాశాలు పెరిగి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది నచ్చని యువతి మరో యువకుడికి సన్నిహితంగా ఉంటోంది. విషయం తెలుసుకున్న జగదీశ్ ఏదోవిధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు.
గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసముంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండ్‌కు తరలించారు.