రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు తన తరఫున ప్రజలే ఎన్నికల శంఖారావా (Poll Bugle)న్ని పూరిస్తారని, తాను కేవలం అభివృద్ధి అనే శంఖారావాన్ని మాత్రమే పూరిస్తానని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ చేరినప్పుడు వివక్ష, అవినీతికి ఆస్కారం ఉండదని వెల్లడించారు. ఇదే నిజమైన సెక్యులరిజం, ఇదే నిజమైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఈ రోజు యూపీలో పర్యటించారు. రాష్ట్రంలో రూ. 19000 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బులందర్ షహర్లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…… రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సేద్యాన్ని సాంకేతికతతో అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
“మోడీ మీకు నిజాయితీగా సేవ చేస్తున్నారు, అందుకే మా ప్రభుత్వంలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. మిగిలిన వారు కూడా పేదరికం నుండి బయటపడతారని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరంతా నా కుటుంబం, మీ కల నా సంకల్పం’అని తెలిపారు. మనం దేవుడి నుంచి దేశానికి, రామ్ నుంచి రాష్ట్రానికి పయనం సాగించాలని పేర్కొన్నారు.
స్వాతంత్య్రానంతరం చాలా కాలంగా కొంతమంది ‘గరీబీ హఠావో’నినాదం ఇచ్చారని… సామాజిక న్యాయం గురించి అబద్ధాలు చెబుతూనే ఉన్నారన్నారు. కానీ దేశంలో కొన్ని కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ధనవంతులుగా మారారని, వారి రాజకీయాలు మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. యూపీ శరవేగంగా అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించలేమన్నారు.
గత పాలకులు యూపీ అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. పశ్చిమ యూపీలో ఈరోజు రూ. 19,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. రైల్వేలు, హైవేలు, పెట్రోలియం పైప్లైన్లు, వాటర్ సప్లై ప్రాజెక్టుల అప్‌గ్రేడ్‌తో పాటు మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. యమున, రామ్‌గంగా నదుల ప్రక్షాళన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.