రాజకీయ పార్టీలు, నేతలు ఇకపై ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం(EC) హెచ్చరించింది. ఈ మేరకు నేతల ప్రసంగాల్లో ఉపయోగించే భాషపై కీలక సూచనలు(Instrucions) చేసింది. దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలని స్పష్టం చేసింది.
ముఖ్యంగా ‘‘మూగ, పాగల్, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి’’ వంటి పదాలను నేతలు వాడకుండా ఉండాలని ఈసీ పేర్కొంది. ఇది అవమానకరమైన భాష కాబట్టి రాజకీయ నాయకుల ప్రసంగాల్లో ఇలాంటి పదాలను నిషేధించాల్సిన అవసరముందని ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది. దివ్యాంగులకు న్యాయం, గౌరవం కల్పించాలని ఈసీ స్పష్టం చేసింది.
ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలతో సహా అన్ని ప్రచార సాధనాల్లో దివ్యాంగుల పట్ల అసహ్యకరమైన లేదా వివక్షతతో కూడిన భాషాపరంగా ఉన్న పదాలను గుర్తించాలని ఈసీ తెలిపారు. వాటిని సరిదిద్దడానికి రాజకీయ పార్టీ అంతర్గత సమీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది. రాజకీయ పార్టీల వెబ్సైట్లలోనూ దివ్యాంగులను గౌరవిస్తున్నట్లు తమ పార్టీ వెబ్సైట్లో ప్రధానంగా ప్రచురించాలని ఈసీ సూచించింది.
అదేవిధంగా రాజకీయ పార్టీలు, నేతల రచనలు, కథనాలను లేదా ఏదైనా బహిరంగ ప్రకటనను ప్రసంగం సమయంలో చెడుగా, అవమానకరమైన పదాలు ఉపయోగించకూడదని సూచించింది. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు ఏదైనా బహిరంగ ప్రసంగంలో, రాజకీయ ప్రచారంలో దివ్యాంగులు, వైకల్యం ప్రతిబింబించే విధమైన పదాలు వాడకూడదని పేర్కొంది.