తెలంగాణ(Telangana) మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. దేశంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల లింకును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో భారీ మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు.
పెద్ద ఎత్తున ఎక్ట్సోసీ మాత్రలు, ఎండీఎంఏ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాలస్తీనాకు చెందిన సయీద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో తిష్టవేసి ఈ చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. అతడు ముంబైకి చెందిన రోమి అనే వ్యక్తి వద్ద నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఎట్టకేలకు నిందితులను పట్టుకున్న పంజాగుట్ట పోలీసులు వారి నుంచి 4.75 గ్రాముల ఎక్ట్సోసి పిల్స్, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. ఈ కేసులో 14మంది స్మగ్లర్లు, వీరి వద్ద రెగ్యులర్‌గా మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న 31మంది పేర్లు పోలీసుల లిస్టులో ఉన్నట్లు తెలిసింది.
ముంబైకి చెందిన రోమి గోవాలో ఉంటున్న క్రిస్ నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్నాడు. సయీద్ ఆర్డర్ ఇవ్వగానే రోమి అక్కడి నుంచి మత్తు పదార్థాలను పంపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉండగా, ఇటీవల జగిత్యాలలో పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసైన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ కేసును లోతుగా విశ్లేషిస్తున్న పోలీసులు దొరికిన ఏ ఆధారాన్ని వదిలిపెట్టడంలేదు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పదో తరగతి విద్యార్థిని మత్తు పదార్థాలు అలవాటు చేసి ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. మత్తు పదార్థాలు అలవాటు చేసి వారిపై లైంగికదాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులు ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.