పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన మూలాలను కనుగొనేందుకు నార్కోటిక్ (Narcotic) అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణ మరింత వేగవంతమైంది. ఇటీవలే రూ.8కోట్ల విలువైన మత్తు పదార్థాలతో స్టాన్ లీ(Stan Lee) పట్టుబడిన సంగతి తెలిసిందే.
టీఎస్ న్యాబ్ విచారణలో అతడు కీలక సమాచారాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. గోవా(Goa) కోల్వలే జైలు నుంచే స్టాన్ లీకి ఓక్రా ముఠా మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు టీఎస్ న్యాబ్ గుర్తించింది. కోర్టు అనుమతితో నార్కోటిక్ బృందం గోవాకి వెళ్లింది.
నార్కోటిక్ బ్యూరో జైలులో ఉన్న ఓక్రాతో పాటు ఫైజల్‌ను విచారించి హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఓక్రా, ఫైజల్ గోవా జైలులో ఉండి సెల్‌ఫోన్స్ ద్వారా యూరప్ దేశాల నుంచి వివిధ రకాల మత్తు పదార్థాలను ముంబైకి తెచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది.
ఓక్రా, ఫైజల్ ఇద్దరూ జైల్లో సెల్‌ఫోన్ వాడుతున్నట్లు గోవా పోలీసులకు నార్కోటిక్ అధికారులు సమాచారం ఇచ్చారు. గోవా కొల్వాలే జైల్లో తనిఖీలు చేసిన గోవా పోలీసులు 16 సెల్ ఫోన్లను గుర్తించారు. ఓక్రా, ఫైజల్‌ను హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తే మరింత సమాచారం వస్తుందని నార్కోటిక్స్ బ్యూరో భావిస్తోంది.