– 13వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
– గళమెత్తిన నిరుద్యోగులు
– ధర్నాచౌక్ లో నిరసన
– ప్రతిపక్షాల సంఘీభావం
ఏళ్లు గడుస్తున్నా టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో టెట్ నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 13 వేల టీచర్ (Teacher) పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ (Hyderabad) ధర్నాచౌక్ వద్ద నిరసనకు దిగారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టుల జీవోలో అనేక జిల్లాల్లో ఒకటి రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయని.. దీంతో ఆరేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నష్టపోతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే 13 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.
కోదండరాం (Kodandaram) మాట్లాడుతూ… ఉద్యోగం ప్రాముఖ్యత కేసీఆర్ కు అర్థం కాదన్నారు. కోట్ల ఆస్తి కొల్లగొట్టారు కాబట్టే ఇది అర్థం కాదని విమర్శించారు. తరాలు గడిచినా తినడానికి సరిపడనంత సంపాదించారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగం రాకపోతే కూలీ చేసువాల్సిన పరిస్థితేనని అన్నారు. జిల్లాలు, జోన్లను ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదని మండిపడ్డారు. టీచర్ల బదిలీల సమయంలోనూ ఇంతే చేశారన్నారు. అడ్డగోలుగా, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు కోదండరాం.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) మాట్లాడుతూ.. లైబ్రరీలో కూర్చోవాల్సిన వాళ్లు చెట్లకింద నిరసనకు దిగడం తెలంగాణ తల్లికి అవమానమన్నారు. ముఖ్యమంత్రికి యువత భవిష్యత్తుపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నా.. అర్జెంటుగా మీరు గానీ, మంత్రి గానీ ధర్నాచౌక్ కు రావాలని చెప్పారు. నిరుద్యోగుల ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలన్నారు. వాళ్లేమైనా మీ ఫాంహౌస్ లో భూమి అడుగుతున్నారా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. 8 వేల స్కూళ్లలో ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అయినా కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మండిపడ్డారు ఆర్ఎస్పీ.