క్రిస్మస్ (Christmas) న్యూ ఇయర్ (New Year) వేడుకల (Celebrations)కి ఎక్కువ రోజులు సమయం లేదు. అదీగాక ఇదివరకే మాదక ద్రవ్యాలు రాష్ట్రాలలో పట్టుబడటం తెలిసిందే.. ముఖ్యంగా ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రధాన నగారాల్లోని అధికారులు రూల్స్ కఠినతరం చేశారు. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడకంపై దృష్టి సారించారు.. ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai) అధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు..
ముంబయిలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వీవీఐపీలే లక్ష్యంగా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబయి పోలీసులు ఈ ఆంక్షలు విధించినట్టు ప్రకటించారు.. మరోవైపు డిసెంబర్ 20 నుంచి 2024 జనవరి 18 వరకు నగరంలో 144 సెక్షన్ ఆంక్షలు అమలులో ఉంటాయని ముంబయి పోలీసులు తెలిపారు.
కాగా ఆంక్షల నేపథ్యంలో నగరంలో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాగ్లైడర్లు, పారా మోటార్లు, హ్యాండ్ గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్ వంటి వాటిని ఎగురవేయడాన్ని నిషేధిస్తున్నట్టు పోలీసులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరైనా వీటిని ఎగురవేయాలంటే ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని సెక్షన్ 188 ప్రకారం శిక్షిస్తామని ముంబయి పోలీసులు హెచ్చరించారు..