ఇప్పుడు పండుగలను డబుల్ ట్రబుల్ వెంటాడుతోంది. హిందూ సంప్రదాయాలకు (Hindu Traditions) అద్దం పట్టే ఈ పండుగల విషయంలో జనం బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోజు పండుగ జరుపుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇలా దాదాపు ప్రతి పండుగ సందర్భంగా కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. మరోవైపు పండితులు కూడా తమ పాండిత్య ప్రదర్శన, జ్ఞానం విజ్ఞానంతో ఆ కన్ఫ్యూజన్‌ని మరింత పెంచేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు 2023 వ సంవత్సరంలో విజయదశమి (Vijayadashami) ఎప్పుడు జరుపుకోవాలి..? అనే సందిగ్ధంలో జనం ఉన్నారు. అందుకే విజయదశమి పండగ ఏ రోజున అనే ఆలోచన పై పూర్తి వివరణ..
అయోమయం గందరగోళం మధ్య హిందూ సంప్రదాయ పండుగలు ప్రతి సంవత్సరం ప్రజలను తికమక పెడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన… నిర్ణయ సింధు (Nirnaya Sindhu), ధర్మసింధు (Dharmasindhu) ప్రకారము… విజయదశమి 23న సోమవారం (Monday) రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పండితులు చెబుతున్నారు.. ఎందుకంటే..?
విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం… ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీపూజ జరగవలసి ఉంటుందని పండితులు అంటున్నారు.. శమీపూజకు అత్యంత ప్రాధాన్యమైన శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి అంటే సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుందని తెలిపారు.. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుందని.. ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం అన్నారు..
ఈ ప్రకారంగా సోమవారం నాడు అపరాహ్ణ ముహూర్తంలో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు వరకు ఉంది. అపరాహ్ణ కాలము పగలు గంటలు 1:00 నుండి మధ్యాహ్నము గంటలు 3: 28 వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున తేదీ 23 -10- 2023 సోమవారం రోజు దసరా పండుగ, శమీ పూజ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పండితులు వెల్లడించారు..
మరోవైపు శృంగేరి పీఠంలో కూడా విజయదశమి, శమీపూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో కూడా విజయదశమి 23 వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు.. తిరుమల తిరుపతి (Thirumala Thirupathi) దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమి ఆచరించుచున్నారు..
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ చేయుచున్నారు.. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించారు.. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం అంటున్నారు… సర్వే జనాః సుఖినోభవంతు.. లోకాస్సమస్తా సుఖినోభవంతు..
- మరిన్ని Telugu news మరియు తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చదవండి !