భారతీయ ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనవాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక(Dwaraka) ఇప్పుడు సముద్రం అడుగున ఉందనడానికి అనేక సాక్ష్యాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసి పోయినట్లు అంచనా వేశారు.
ఇప్పటి వరకు పరిశోధకులు తీసిన ఫొటోలు, వీడియోలనే చూసి ఉంటాం. అయితే, అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారక నగరాన్ని దర్శించేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ‘ద్వారకా సబ్ మెరైన్ టూరిజం'(Dwaraka Submarine Tourism Project) ప్రాజెక్టును చేపడుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం(Gujarat Government) ప్రకటించింది.
సందర్శకులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్లు గుజరాత్ సర్కార్ పేర్కొంది. ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్ మెరైన్ నుంచి చూడొచ్చని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి పండగ సందర్భంగా సబ్ మెరైన్ యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పర్యాటకులను సబ్ మెరైన్లలో తీసుకెళ్లటం ఇదే తొలి సారి.
ఇందు కోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ‘మజ్ గావ్ డాక్’ షిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఒక ట్రిప్ లో 24 మంది పర్యాటకులకు ఈ సబ్ మెరైన్లో తీసుకెళ్తామని, అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారని గుజరాత్ టూరిజం శాఖ పేర్కొంది.
మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138 లో జరిగింది. ఆ తర్వాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారకలో పాలించాడు. గాంధారి శాపంతో కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం వారిలో వారే గొడవలు పడడంతో సామ్రాజ్యం పతనమైనట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు.. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లినట్లు మహాభారతంలో ప్రస్తావించబడింది.