అగ్రరాజ్యం అమెరికా(USA) లో భారీ భూకంపం సంభవించింది. న్యూజెర్సీ(New Jersey), న్యూ యార్క్(New York) నగరాల్లో భూప్రకంపనలు రావడంతో జనం భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. న్యూజెర్సీలోని గ్లాడ్ స్టోన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు గుర్తించారు. భూకంపం 9.7 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది.
ఇది న్యూజెర్సీలోని వైట్ హౌజ్‌కు దగ్గరలోనే ఉందని తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం న్యూజెర్సీలో శుక్రవారం ఉదయం 10:23 నిమిషాలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. 8గంటల తర్వాత 4.0తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఈ భూకంపం భవనాలను కుదిపేసింది. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. అత్యంత రద్దీగా ఉండే ఆమ్హక్ రైల్వే వ్యవస్థ తమ రైళ్ల వేగాన్ని తగ్గించింది. అధికారులు వంతెనలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు. ఫిలడెల్ఫియా, కనెక్టికట్, మన్‌హట్టన్, బ్రూక్లిన్, బాల్టిమోర్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది.
అటు గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు ఐరాస దౌత్యవేత్తలు శుక్రవారం భేటీ కాగా భూకంపం కారణంగా స్వల్ప ఆటంకం కలిగింది. భూకంపానికి సంబంధించిన అప్రమత్తత సందేశాలతో అందరి ఫోన్లకు ముందుగానే సందేశాన్ని పంపించారు అధికారులు. ఇక ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. ఎలాంటి నష్టం జరగలేదని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ చెప్పారు.
ఇటీవల తైవాన్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. ఈ ఘటనలో తొమ్మిది మృతిచెందగా.. దాదాపు 2వేల మంది గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా భూకంపాలు వచ్చే అగ్రరాజ్యం అమెరికాలోనూ భూకంపం సంభవించడం సంచలనంగా మారింది.