తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో దారుణ ఘటన జరిగింది. దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్య ఘటన.. దొమ్మేరును కుదిపేసింది. హోం శాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్నకొవ్వూరు నియోజకవర్గం లోని దొమ్మేరు గ్రామంలో అధికార వైసీపీ వర్గ విభేదాల కారణంగా మంత్రి తానేటి వనితకు చెందిన ప్లెక్సీ చినిగి పోవడంతో నిప్పు రాజుకుంది.
మహేంద్రకు ఈ ఘటనతో సంబంధం ఉండవచ్చు అనే అనుమానంతో కొవ్వూరు పోలీసులు స్టేషన్ కి పిలిపించి విచారణ పేరుతో దూషించినట్టు మహేంద్ర కుటుంబం ఆరోపిస్తోంది. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మనస్తాపంతో మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దొమ్మేరు ఎస్సైపై, అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదిలావుంటే, దళిత యువకుడి శవంతో దొమ్మేరు (Dommeru) గ్రామస్థులు.. నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి మహేంద్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇక మృతుడు కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో పాటు హోం మంత్రి (Home Minister) తానేటి వనిత (Taneti Vanitha) దొమ్మేరుకు వెళ్లారు.
నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని అడ్డుకున్నారు. గంటన్నరపాటు రోడ్డుపైనే కదలనీయకుండా చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన మంత్రి నాగార్జున, ఎమ్మెల్యే వెంకట్రావు ప్రభుత్వం తరఫున 10 లక్షలు, వైసీపీ (YCP) నాయకుడి తరఫున 10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ గొడవ కాస్త సద్దుమనిగింది.