సంక్షేమంలో నెంబర్ వన్ అని చెప్పుకునే కేసీఆర్ (KCR).. నిరుద్యోగ భృతి, లక్ష రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, 57 ఏళ్లకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీజేపీ (BJP) ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender). వీటిని అమలు చేయకపోవడానికి కారణం మనసు లేకనా? డబ్బులు లేకనా? అంటూ నిలదీశారు. రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా తాను అప్పుడే చెప్పానని.. హామీలు ఇవ్వడం కాదు అమలు చేయడం ముఖ్యమని అంటే అవహేళన చేశారని గుర్తు చేశారు. మరిప్పుడు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడిగారు.
ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న అన్నట్టు.. ఓట్లప్పుడు ఉండే ప్రకటన చేతల్లో ఎందుకు లేదని కేసీఆర్ ను నిలదీశారు ఈటల. రుణమాఫీ ఇస్తా అని ఇన్ని రోజులు ఇవ్వకుండా మోసం చేశారని.. ఇప్పుడు ఓటమి తప్పదని గ్రహించి రింగ్ రోడ్డు కుదవ పెట్టి, భూములు అమ్మి, మద్యం టెండర్లు ముందు పెట్టి డబ్బులు తెచ్చి రైతులకు ఇస్తున్నానని ప్రకటించారని.. అయినా, మొత్తం రుణమాఫీ కాలేదన్నారు. 2018 నాటికే అప్పు డబుల్ అయ్యిందని.. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యిందని తెలిపారు.
57 ఏళ్ల పెన్షన్ కాదు భర్తలు చనిపోయిన వారికి కూడా నాలుగు ఏళ్లుగా దిక్కులేదన్నారు రాజేందర్. డబ్బులు లేక కేసీఆర్ హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందిస్తూ.. గత ఆర్థిక మంత్రిగా అమలు కానీ హామీలు ఇవ్వొద్దని సూచించారు. ‘‘ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తా అన్నారు. కోటిన్నర మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వగలరా? రూ.4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడే 2 నెలలు పెండింగ్ ఉంటుంది. ఎలా ఇస్తారు సమాధానం చెప్పండి’’ అని అడిగారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే లక్ష రుణమాఫీ సాధ్యం కాదని చెప్పానని.. 2 లక్షల కోట్లు ఎలా చేయగలరని అన్నారు.
రాష్ర్ట ఆర్థిక ప్రగతి 5 శాతం కంటే ఎక్కువ ఉండదన్న ఈటల.. కర్ణాటక మోడల్ అంటున్నారు.. అక్కడ ఇచ్చిన హామీలు ఎలా ఇస్తున్నారో చూస్తూనే ఉన్నామని ఎద్దేవ చేశారు. హామీలు ఎలా అమలు చేస్తారో ప్రజలు నిలదీయాలని.. ఇలాంటివి నమ్మొ మోసపోవద్దని సూచించారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఎంత? ఎఫ్ఆర్ఎంబీ ద్వారా వచ్చేది ఎంత? కేంద్రం ఇచ్చేది ఎంత? అనే సంపూర్ణ అవగాహన ఉండాలని చెప్పారు. బీజేపీ మాట ఇస్తే తప్పదని.. కేంద్ర నాయకత్వం తెలంగాణ మీద దృష్టి పెట్టిందన్నారు. అణగారిన వర్గాలకు ఏ స్కీమ్ లు చెయ్యాలో డిజైన్ చేస్తామని.. కేంద్ర సమన్వయంతో ఎక్కువ నిధులు తెస్తామని చెప్పారు.