సీఎం కేసీఆర్ (CM KCR) మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని అన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్ (Eatala Rajender). షాద్ నగర్ లో అభ్యర్థి అందె బాబయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల బాధలు తీరాలని అన్నారు.
బాబయ్య.. తనతో పాటు టీఆర్ఎస్ కు రాజీనామా చేసినప్పుడు ఆగిపో ఎమ్మెల్సీ ఇస్తా అని కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారని.. మీ ఎమ్మెల్సీ కంటే రాజేందరే తనకు ముఖ్యమని ఆయన చెప్పారన్నారు. ‘‘ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చారు. నాయకులు చాలా రకాలు ఉంటారు. ప్రజాసేవ చేయడానికి ఆరడగుల ఎత్తు, రంగు, డబ్బులు అవసరం లేదు. మనసు ఉండాలి. ఎన్నికలంటే ఒక తంతులా భావించవద్దు. మన తలరాత మారడానికి ఏకైక ఆయుధం ఓటు. ఆ హక్కు, ఆత్మగౌరవానికి వెలకట్టి కొనాలని చూస్తున్నారు’’ అని చెప్పారు.
డబుల్ బెడ్రూం ఎంతమందికి ఇచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు రాజేందర్. ఇళ్లు కట్టకుండా కళ్ళలో మట్టికొట్టారని ఆరోపించారు. రెండవ సారి అదికారంలోకి వచ్చాక కేసీఆర్ మారిపోయారని.. ప్రజలను కలవకుండా ప్రగతి భవన్ లేదంటే ఫాం హౌస్ కి పరిమితం అయ్యారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి పేరుతో ఇచ్చేది 2500 కోట్లు.. పెన్షన్, రైతు బంధు, రైతు బీమా అన్నీ కలిపితే 25 వేల కోట్లు.. కానీ లిక్కర్ సీసాలు అమ్మి సంపాదించేది 45 వేల కోట్లు అంటూ మండిపడ్డారు.
‘‘పిల్లలను 25 సంవత్సరాలు చదివిస్తే ఉద్యోగాలు వస్తున్నాయా? 1200 మంది ఆత్మబలిదానాలు చేసింది నౌకర్ల కోసమే కదా? ఒక ముత్యాల శంకర్, ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నారు. వాటిని కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ హయాంలో మహిళా సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. వడ్డీలేని రుణాల కింద 4,200 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. బీజేపీ వస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని ప్రకటించారు. అంతిమ న్యాయ నిర్ణేతలు మీరే’’ అని ప్రజలకు వివరించారు ఈటల రాజేందర్.