బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు ఈటల. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో పర్యటించారు. పాతర్లపల్లి ఊరికి వెళ్ళే బ్రిడ్జి తెగిపోవడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. వరద ఉధృతికి మునిగిన ఇళ్ళను చూసి ఆవేదన చెందారు. వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరామర్శించారు.
వరదలతో జనం చస్తున్నా.. బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువైందని విమర్శించారు రాజేందర్. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని.. పరిహారానికి మాత్రం దిక్కు లేదన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు ఆందజేయాలని డిమాండ్ చేశారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయని.. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని.. చేతల్లో మాత్రం ఏమీ ఉండదని ఎద్దేవ చేశారు ఈటల.
శుక్రవారం కూడా వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు. వరంగల్ లాంటి నగరాలను, ఇతర పట్టణాలను లండన్, డల్లాస్, న్యూయార్క్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే ఈ దుస్థితి కొనసాగుతూనే ఉందని, నిజాయితీగా పని చేయడం ఆయనకు చేతకాదన్నారు. హైదరాబాద్ లో వరదలప్పుడు 10 వేల రూపాయలు ఎలా ఇచ్చారో ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం వరద ప్రాంతాలలో అందించాలని డిమాండ్ చేశారు.
ఇక భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధిత కుటుంబాలను కలిశారు రాజేందర్. ప్రకృతి వైపరీత్యానికి ఎవరూ కారణం కాదని, కాకపోతే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ఇక్కడి వరద బాధితులకు పది లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ పరంగా గ్రామస్తులను ఆదుకుంటున్నామని చెప్పారు. మోరంచపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేయడంలోనూ, ముంపు తర్వాత సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ఆరోపించారు ఈటల రాజేందర్.