Telugu News » ఎన్నిక‌ల వేళ బీజేపీలో భారీ మార్పులు.. దేనికి సంకేతం?

ఎన్నిక‌ల వేళ బీజేపీలో భారీ మార్పులు.. దేనికి సంకేతం?

by admin
bjp flag

తెలంగాణ స‌హా త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లున్నాయి. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ ఆయా రాష్ట్రాల పార్టీలు గెలుపు వ్యూహాల్లో మునిగిపోయాయి. భారీ మార్పుల‌కు శ్రీకారం చుడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ విష‌యంలో ఓ అడుగు ముందుకే ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌లు, 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని కీల‌క నాయ‌కుల‌కు పోస్టులు కేటాయిస్తోంది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.

bjp flag

ఈమ‌ధ్యే తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా పార్టీ అధ్య‌క్షుడ్నే మార్చింది అధిష్టానం. అంతేకాదు, పార్టీ రాష్ట్ర ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ పోస్ట్ ను తెర‌పైకి తెచ్చింది. అధ్య‌క్షుడిగా బండిని తొల‌గించి కిష‌న్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించింది. అలాగే, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ బాధ్య‌త‌ల‌ను ఈట‌ల రాజేంద‌ర్ కు ఇచ్చింది. ఈ మార్పుతో బీజేపీ నేత‌ల్లో భిన్న వాద‌న‌లు వినిపించినా.. అధిష్టానం నిర్ణ‌యానికి వారు స‌రేన‌న్నారు. అయితే.. కార్య‌క‌ర్తల్లో మాత్రం ఎలాంటి భేదాభిప్రాయాలు లేవ‌నేది రాజ‌కీయ పండితుల వాద‌న‌.

ఈట‌ల రాజేంద‌ర్ కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ముదిరాజ్ క‌మ్యునిటీ, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల వారు ఆయ‌న్ను బాగా న‌మ్ముతారు. ఈ లెక్క‌ల‌న్నీ వేసుకునే అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం ఈట‌ల‌ను ముందుంచుతోంద‌ని.. అందుకే కార్య‌క‌ర్త‌లు హైక‌మాండ్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. ఇటు అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌మ నాయ‌కుడిని తొల‌గించార‌నే అస‌హ‌నంతో ఉన్న బండి వ‌ర్గాన్ని కూడా చ‌ల్ల‌బ‌రిచేందుకు కేంద్ర నాయ‌క‌త్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ స‌మ‌యంలో పలువురి హోదాలు మార్పు చేసి.. సీనియర్​ నేతలకు ముఖ్యమైన ప‌ద‌వులను కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ని నియమించింది. అలాగే,
జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్ ను కొనసాగించనున్నట్లు అధిష్టానం వెల్లడించింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్ ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. మొత్తానికి రానున్న అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హైక‌మాండ్ భారీ మార్పుల‌కు దిగింది. ఇవి పార్టీని గెలుపు దిశ‌గా ప‌య‌నించేలా చేస్తాయ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు.

You may also like

Leave a Comment