కేసీఆర్ (KCR) ను ఢీ కొట్టేందుకు గజ్వేల్ (Gajwel) లో తొలి అడుగు వేశారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajender). ముందుగా వర్గల్ లో సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గజ్వేల్ ముఖద్వారం వంటిమామిడిలో ఆయన ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా గజ్వేల్ లో అడుగుపెట్టానని అన్నారు. వర్గల్ లో తాను 10 సంవత్సరాలు ఉన్నానని.. ఇక్కడ తన ఇళ్ళు, పౌల్ట్రీ ఉండేవని తెలిపారు. ఇక్కడి గుడితో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు.
బీజేపీ (BJP) మీటింగ్ కి రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఈటల. దావత్ లు ఇచ్చి, పైసలు పంచి ఆపుతున్నారని.. ఇదే హుజూరాబాద్ లో కూడా చేశారని తెలిపారు. కానీ, అక్కడ ప్రలోభాలను, డబ్బు పంపకాలను పాతరవేసి ధర్మాన్ని, న్యాయాన్ని ప్రజలు గెలిపించుకున్నారని చెప్పారు. గజ్వేల్ లో కూడా అదే జరగబోతోందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన ఆయన.. వేల ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గుంజుకున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలకు ఇష్టం వచ్చినట్టు భూములు ఇస్తున్నారని అన్నారు. కోటి రూపాయల విలువ ఉన్న భూములను 8 లక్షలకు గుంజుకొని.. రైతులను అడ్డమీద కూలీలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ మహాభారత యుద్ధం జరగబోతోందని.. కౌరవులకు, పాండవుల మధ్య జరిగే ఈ వార్ లో.. అంతిమ విజయం పాండవులదే, ధర్మానిదేనని తెలిపారు.
పెన్షన్ ఆపుతామని బెదిరిస్తున్నారట.. ఇదే మన్నా వారి అబ్బజాగీరా? అంటూ మండిపడ్డారు ఈటల. గజ్వేల్ ప్రజలారా ధర్మాన్ని కాపాడండి. అమెరికా, లండన్ ప్రపంచం అంతా మీ వైపు చూస్తోందని అన్నారు. చైతన్యాన్ని ప్రదర్శించి తనను ఆశీర్వదించమని కోరారు ఈటల రాజేందర్.